అ
సాక్షి, అమలాపురం: జలవనరుల శాఖ అనుమతులు లేకుండా అభివృద్ధి పేరుతో చేపట్టిన అడ్డగోలు నిర్మాణాలు కోనసీమ రైతులకు శాపంగా మారాయి. నిన్నటి వరకూ ప్రధాన పంట కాలువలకు అడ్డంగా వంతెనలు, రోడ్లు నిర్మించడంతో 22 వేల ఎకరాల ఆయకట్టు రైతులు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు. వందల ఎకరాల్లో నారుమడులు ఎండిపోతున్నాయి.
కాలువలను కుదించిన అభివృద్ధి
అమలాపురం నడిపూడి లాకుల నుంచి చల్లపల్లి వర కూ ఉన్న ప్రధాన పంట కాలువ అడుగడుగునా కుదించుకుపోతోంది. 1996–97లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి మెట్ల సత్యనారాయణరావు కాలువ కుడిగట్టును ఆక్రమించి ఎన్‌టీఆర్ మార్గాన్ని నిర్మించారు. 2015–16లో అప్పటి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హయాంలో ఎడమ కాలువ గట్టును ఆక్రమించి బైపాస్ రోడ్డును విస్తరించారు. దీంతో 1:1.5 వెడల్పు ఉండాల్సిన కాలువ 1:1 రేషియోకు పడిపోయింది. ఫలితంగా శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. తాజాగా గత ఏడాది ఈ కాలువపై నడిపూడి లోకల్ వద్ద, ఈ ఏడాది అమలాపురం బైపాస్ రోడ్డులో, కామన్ గరువు బైపాస్ సమీపాన రెండేసి చొప్పున మొత్తం నాలుగు వంతెనలు నిర్మించారు. ఈ వంతెనల పిల్లర్లు కాలువ మధ్యలోకి రావడంతో ప్రవాహానికి తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో, కాలువలో గ్రావిటీ (వాలుకు ప్రవహించడం) పూర్తిగా పడిపోయింది.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
వంతెనల నిర్మాణానికి అడ్డంగా వేసిన మట్టికట్టలను తొలగించకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వదిలేశారు. దీనివల్ల అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం మండలాల్లోని పలు గ్రామాలు, ముమ్మిడివరం, అల్లవరం మండలాల పరిధిలోని శివారు గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ముక్కామల సమీపాన అయినవిల్లి మండలం నేదునూరు వద్ద జాతీయ రహదారి–216లో భాగంగా రోడ్డు కుంగిపోతున్న ప్రాంతంలో గత క్లోజర్ సమయంలో రివిట్‌మెంట్ పనులు ప్రారంభించారు. నీరు వదిలిన తర్వాత రెండో విడత రివిట్‌మెంట్ పనులు మొదలుపెట్టారు. ఈ పనులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో కాలువలకు నీరు ఇవ్వలేదు. దీంతో, శివారు ప్రాంతాలకు అందక మొత్తంగా 22 వేల ఎకరాల్లో సాగు ముప్పులో పడింది.
అనుమతులు లేకుండానే..
డెల్టా కాలువ పరీవాహక ప్రాంతాల్లో ఏ నిర్మాణం చేపట్టినా జలవనరుల శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ ప్రస్తుతం పలుచోట్ల వంతెనలు నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారులు, ఎన్‌హెచ్ అధికారులు ఎటువంటి అనుమతులూ తీసుకోలేదు. అది తప్పని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పైగా, ఎమ్మెల్యేల దన్ను ఉందనే ఉద్దేశంతో ఒంటెద్దు పోకడలు పోయారు. తద్వారా ఆయకట్టుకు తీరని అన్యాయం చేశారు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన ఒక జేఈ స్థాయి అధికారి ఎమ్మెల్యేకి ఎదురు చెప్పలేక గత వేసవిలో దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోవడం కూడా చర్చనీయాంశమైంది.
కాంట్రాక్టర్, రెవెన్యూ అధికారులపై మంత్రి చిందులు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగులో నారు ఎండిపోవడానికి ప్రధాన కారణం జలవనరుల శాఖ నిర్లక్ష్యం. తమ అనుమతి లేకుండా ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ అధికారులు కాలువల్లో నిర్మాణాలు చేపట్టినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ పలు సందర్భాల్లో వెలుగులోకి తెచ్చింది. అయినప్పటికీ అధికారుల్లో లెక్కలేనితనం నెలకొంది. మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం జరిపిన పర్యటనలోనే ఈ అక్రమాలు వెలుగు చూశాయి. అయినప్పటికీ ఆయన ఇరిగేషన్ అధికారులను, ఈ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్న సొత పార్టీ నేతలను వదిలేసి, ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, రెవెన్యూ అధికారులపై చిందులు తొక్కడం విచిత్రం. చేతుల కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు వెంటనే కాలువల్లో అడ్డంకులు తొలగించి, రైతులకు నీరందించాలని మంత్రి ఆదేశించారు.
పంట కాలువలపై
ఇష్టానుసారం నిర్మాణాలు
వంతెనలు, రోడ్ల విస్తరణ
జలవనరుల శాఖ అనుమతులు నిల్
అధికార పార్టీ నేతల అండతో
కాంట్రాక్టర్లు, అధికారుల బరితెగింపు
ఫలితంగానే కోనసీమలో
ఎండుతున్న నారుమళ్లు
అమలాపురంలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు ఏటా తప్పని నీటి కష్టాలు
ఇక నుంచి ప్రతిసారీ ఇక్కట్లే..
అభివృద్ధి అంటే ఆనందరావు అని చెప్పుకొంటున్న అమలాపురం ఎమ్మెల్యే కనీస నియమ నిబంధనలు పాటించకుండా కాలువలపై ఇష్టానుసారం వంతెనలు నిర్మించడాన్ని రైతులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. వీటికి అనుమతులే కాదు, అంచనాలు కూడా లేవనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ కాలువలపై అక్రమ నిర్మాణాలు పెరుగుతాయని, ఆపై అడ్డుగోలు దోపిడీ జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణాల వల్ల ఇప్పుడే కాదు.. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో అమలాపురం – చల్లపల్లి పంట కాలువ పరిధిలో రైతులు నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ దుస్థితికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులే కారణమని రైతులు మండిపడుతున్నారు. భవిష్యత్తులోనూ అమలాపురం నియోజకవర్గంలో సాగుకు ఇలాంటి ఇక్కట్లే తప్పవని వారు ఆందోళన చెందుతున్నారు.


