ఉప్పలగుప్తం: పొట్టకూటికి వెళ్లి.. తిరిగి వస్తూండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఎన్.కొత్తపల్లి చెందిన ట్రక్కు ఆటోలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు, వానపల్లిపాలేనికి చెందిన ఎనిమిది మంది కలిసి అల్లవరం మండలం సామంతకుర్రు చెరువులో చేపల పట్టుబడికి శనివారం వెళ్లా రు. పని ముగించుకుని స్వగ్రామాలకు అదే ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఎస్.యానాం పంచాయతీ పరిధి అయితాబత్తులవారిపేట సమీపాన ఓ మలుపు వద్దకు వచ్చేసరికి వేగంగా వస్తున్న ట్రక్కు ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలో బోల్తా పడింది. ట్రక్కులో ఉన్నవారు పంట బోదె లోని ఊబిలో కూరుకుపోగా వారిపై ఆటో పడిపోయింది. దీంతో, ఊపిరాడక ఎన్.కొత్తపల్లికి చెందిన సంగాని శ్రీరామ రాజు (30), కొండిపర్తి లోకేష్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు అతి కష్టం మీద స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ పరారయ్యాడు. మృతుడు రాజు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అతడికి ఇద్దరు సోదరులు. ముగ్గురినీ తల్లి కూలి పని చేసుకుంటూ పెంచి, వివాహం చేసింది. రాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు లోకేష్ అవివాహితుడు. తల్లి విదేశాల్లో మూడు నెలల క్రితం గుండెపోటుతో చనిపోవడంతో వానపల్లిపాలెంలో అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉంటున్నాడు. పది నిమిషాల్లో ఇంటికి చేరుకునేవారని, ఇంతలోనే ఘోరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదని మృతదేహాల వద్ద వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.


