ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ కార్యదర్శిగా పుల్లేశ్వరరావు
అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గానికి చెందిన టి.పుల్లేశ్వరరావును పార్టీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. పుల్లేశ్వరరావును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు అభినందించారు.
ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు
కొత్తపేట: కోనసీమ తిరుపతి, వాడపల్లి క్షేత్రంలో మూడో రోజైన బుధవారంతో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఏడు వారాల వెంకన్న దర్శనం – ఏడేడు జన్మల పుణ్యఫలం నానుడితో స్వామికి వివిధ పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, అర్చక, వేదపండితుల బృందం మూడు రోజులు పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, ఉత్సవ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడోరోజు స్వామివారిని, పవిత్రోత్సవ కార్యక్రమాల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. అనంతరం రాత్రి వరకూ సంకల్పం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మహా శాంతిహోమం, ప్రయచ్చిత హోమాలు, మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహాదాశీర్వచనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాల వితరణతో ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

వైఎస్సార్ సీపీ యువజన విభాగ జోన్–2 అధ్యక్షుడిగా కారుమూరి