అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, మీకోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు నేరుగా చేసి తెలుసుకోచ్చని అన్నారు.
ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికై న స్నేహిత
అమలాపురం టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందడం అంత సులువేమీ కాదు.. ఇలాంటి రోజుల్లో అమలాపురానికి చెందిన నాట్ర రమ స్నేహిత ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నెల మొదటి వారంలో వెలువడిన బ్యాంక్ ఉద్యోగాల ఫలితాల్లో ఆమె నాలుగు బ్యాంక్ ఉద్యోగాలకు అర్హత సాధించింది. నాట్ర సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణ విశాలి దంపతుల కుమార్తె రమ స్నేహిత. తండ్రి సుబ్రహ్మణ్యం అమలాపురంలో ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా, తల్లి అన్నపూర్ణ గృహిణిగా ఉన్నారు. స్నేహిత సోదరుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, గ్రామీణ బ్యాంక్‌ల క్లర్క్ ఉద్యోగాలకు, గ్రామీణ బ్యాంక్ స్కేల్–1 ఆఫీసర్ ఉద్యోగానికి ఆమె ఎంపికై ంది. స్నేహిత విద్యాభ్యాసం పదో తరగతి వరకూ అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాగింది. అలాగే ఇంటర్ అమలాపురం శ్రీచైతన్య జూనియర్ కళాశాల, బీటెక్ భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన స్నేహిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ ఉద్యోగానికి వెళ్లకుండా బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి బ్యాంక్‌లో కొలువు సాధించాలని పట్టుదలతో ముందుకు సాగింది. ఒకేసారి నాలుగు బ్యాంక్ ఉద్యోగాలకు అర్హత సాధించడం పట్ల స్నేహితను ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందనలతో ముంచెత్తారు.
తలుపులమ్మ సన్నిధిలో రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని క్యూలో 19 వేల మంది దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,44,720, పూజా టికెట్లకు రూ.1,72,190, కేశఖండన శాలకు రూ.9,040, వాహన పూజలకు రూ.9,830, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.51,870, విరాళాలు రూ.25,475 కలిపి మొత్తం రూ.4,12,675 ఆదాయం సమకూరిందని వివరించారు.


