అమలాపురం రూరల్: అమలాపురం బాలయోగి స్టేడియంలో రెండు రోజులుగా ఉత్సాహభరితంగా జరిగిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠరావు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. మొత్తం 8 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. శాప్ మిక్స్‌డ్ డబుల్స్ టోర్నమెంట్‌లో రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. రాజీ, విజయ్ జంట చక్కని సమన్వయంతో ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. అనంతరం జరిగిన సభలో కోనసీమ క్రీడా మండలి అధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ షటిల్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ మాతృమూర్తి రంగమణి మాట్లాడుతూ పట్టుదలతో కృషి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని ఆకాంక్షించారు. ముగింపు వేడుకలో విజేతలకు బహుమతులు అందజేశారు. పప్పుల శ్రీరామ చంద్రమూర్తి, మండేల బాబీ, మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.


