సాక్షి, అమలాపురం: విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.. వచ్చే నెల 1వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. గతేడాది ‘పది’ పరీక్షల్లో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ చెబుతోంది. ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే సెక్షన్ 25 ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. సాధ్యమైనంత వరకూ విద్యార్థులు సమయ పాలన పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు సివిల్ డ్రస్‌లోనే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. విద్యార్థుల సమస్యలు అధిగమించేందుకు జిల్లా కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. పరీక్షలు సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఎల్.కృష్ణఫణిని జిల్లా పరిశీలకులుగా నియమించారు. గతేడాది మాదిరిగానే జిల్లా కేంద్రంగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఎన్ని కేంద్రాలంటే..
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 405 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 19,310 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 మండలాల పరిధిలో 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. 12,668 మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి, 6,642 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరు కాకుండా 167 మంది ఒకసారి పరీక్షలు తప్పిన విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. అలాగే 3,279 మంది విద్యార్థులు ఒకేషనల్ పరీక్షలు రాయనున్నారు.
నోఫోన్ జోన్లుగా కేంద్రాలు
పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, వైద్య సిబ్బంది ఫోన్లు తీసుకుని వెళ్లడానికి వీల్లేదు. ఏ ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ ఉన్నా సస్పెన్షన్‌తో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. సీఎస్ ఒక్కరి వద్ద మాత్రమే సమాచారం అందజేసే నిమిత్తం ఫోన్ వినియోగించే అవకాశముంది. పరీక్షా కేంద్రాల్లోకి ప్రజాప్రతినిధులు, మీడియాకు అనుమతి ఉండదు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రతి మూడు పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ చేయనున్నారు. ఈసారి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా పనిచేయనున్నారు. ఒక కేంద్రానికి కేటాయించిన ఇన్విజిలేటర్లను మూడు రోజుల కంటే ఎక్కువ ఉంచరు. తర్వాత మరో కేంద్రానికి పంపుతారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
సబ్జెక్టు టీచర్లను నియమించరాదు
ఇన్విజిలేషన్ విధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్జెక్టు టీచర్లను నియమించరు. పీఈటీలు, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్లతో పాటు ఎస్జీటీల సేవలను వినియోగించుకోనున్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులను వారి సబ్జెక్టు రోజు ఇన్విజిలేషన్ విధులు నిర్వహించడానికి లేదు. పాఠశాల విధులకు ఆటంకం కలగకుండా ఇన్విజిలేటర్ల నియామకం చేపడుతున్నారు. సింగిల్ టీచర్ ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి ఇన్విజిలేషన్ విధులకు టీచర్‌ను నియమించరు. సెల్ఫ్ సెంటర్లుగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో అదే పాఠశాలల నుంచి టీచర్లను సీఎస్, డీఓ, ఇన్విజిలేషన్ విధులకు నియమించకుండా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించే ముందు నామినల్ రోల్స్, ఫొటో అటెండెన్స్ షీట్లలో ఉన్న విషయాలను సరిచూసుకున్న తర్వాతే అనుమతించాలని స్పష్టం చేసారు.
ఫ నేటి నుంచి ‘పది’ పరీక్షలు ప్రారంభం
ఫ ప్రతి మూడు పరీక్షలకు జంబ్లింగ్
ఇన్విజిలేషన్
ఫ జిల్లాలో 108 పరీక్షా కేంద్రాలు
ఫ హాజరు కానున్న 19,310 మంది
విద్యార్థులు
జిల్లాలో ఇలా..
పరీక్ష కేంద్రాలు 108
మొత్తం విద్యార్థులు 19,310
బాలురు 9,779
బాలికలు 9,531
చీఫ్ సూపరింటెండెంట్లు 108
డిపార్ట్‌మెంటల్ అధికారులు 108
అసిస్టెంట్ డిపార్ట్‌మెంటల్ అధికారులు 03
ఇన్విజిలేటర్లు 1,300
ఫ్లయింగ్ స్క్వాడ్స్ 05
సిట్టింగ్ స్క్వాడ్స్ 35
సీసీ కెమెరాలు ఉన్న పరీక్షా కేంద్రాలు 08
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు
96664 37749
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్: 93981 33739
25 యాక్ట్ అమలుకు ఆదేశాలు
మరోవైపు యాక్ట్–25, 1997 అమల్లో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షా కేంద్రంలో స్క్వాడ్స్ వచ్చినప్పుడు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే, దానికి ఇన్విజిలేటర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారితో పాటు సీఎస్, డీఓలను బాధ్యులను చేస్తారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఆర్నెళ్ల నుంచి మూడేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా వేస్తారు.
స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం
పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. ఎక్కడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. మాల్ ప్రాక్టీస్ కేసులు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవు.
–జి.నాగమణి, ఆర్జేడీ,
పాఠశాల విద్యాశాఖ,
కాకినాడ
ప్రశ్నపత్రాలకు సీరియల్ నంబరు
విద్యార్థులకు అందించే ప్రశ్నపత్రాలకు సీరియల్ నంబరు ఉంటుంది. పరీక్షకు హాజరు కాాని వారి ప్రశ్నపత్రాలు పక్కన పెడతాం. విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తారు. అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తారు.
–పి.నాగేశ్వరరావు,
జిల్లా విద్యాశాఖ అధికారి,
అమలాపురం
డ్రోన్ కెమెరాలతో నిఘా
అమలాపురం టౌన్: జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు డ్రోన్ కెమెరాలు, నిరంతర పెట్రోలింగ్‌తో పూర్తి నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద గుంపు గుంపులుగా ఉండడం నిషేధమన్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేఫ్‌లను వాటి నిర్వాహకులు విధిగా మూసివేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. జిల్లా విద్యా శాఖతో తమ పోలీస్ శాఖ సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.


