మరో ఇద్దరు సురక్షితం
ముమ్మిడివరం: అంత్యక్రియలకు వెళ్లి గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటన ముమ్మిడివరం మండలం అయినాపురం వియర్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అయినాపురానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు మృతి చెందగా, అతని బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. శ్మశానంలో అంత్యక్రియల అనంతరం అయినాపురం వియర్ వద్ద గౌతమీ గోదావరి పాయలో స్నానం చేస్తుండగా ప్రవాహ వేగానికి మట్టపర్తి భానుప్రసాద్ (28)కొట్టుకుపోయాడు. అందరూ స్నానం చేస్తుండగా భానుప్రసాద్, సానబోయిన రాములు నదిలో కొంచెం ముందుకు పోతుండగా రాము తండ్రి పట్టాభి వారిద్దరినీ రక్షించేందుకు వెళ్లాడు. తనకు రాము చేయి చిక్కగా, భానుప్రసాద్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే పట్టాభి, రాములు కూడా ప్రవాహ వేగం నుంచి బయటకు రాలేకపోవడంతో స్థానికులు వారిని ఒడ్డుకు చేర్చారు. మట్టపర్తి శ్రీనివాస్, మహాలక్ష్మి దంపతుల రెండో కుమారుడు భానుప్రసాద్. శ్రీనివాస్ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. మృతుడు భానుప్రసాద్ హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ నుంచి అయినాపురంలో సొంత ఇంటికి వచ్చాడు. గోదావరిలో గల్లంతైన భానుప్రసాద్ కోసం పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టగా, అక్కడికి కొంచెం దూరంలో మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని ఎస్సై డి.జ్వాలాసాగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


