డబ్బు సంచులు తెచ్చారా !  అయితే ఓకే.. టిక్కెట్టు మీకే | - | Sakshi
Sakshi News home page

డబ్బు సంచులు తెచ్చారా !  అయితే ఓకే.. టిక్కెట్టు మీకే

Feb 4 2024 11:50 PM | Updated on Feb 5 2024 1:56 PM

- - Sakshi

సాక్షి, అమలాపురం: బడుగు బలహీన వర్గాలు, దళితులకు అండగా నిలిచేది తమ పార్టీయేనని, వారికి రాజ్యాధికారం కల్పించింది తామేనని ప్రతిపక్ష టీడీపీ.. వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని జనసేన పార్టీలు గొప్పలు చెప్పుకుంటూనే.. ఆ వర్గానికి చెందిన నాయకులను కూరలో కరివేపాకుల్లా వాడుకుని వదిలేస్తున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా ఆ రెండు పార్టీల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణ. పొత్తులు, ఆర్థిక బలం పేరుతో ఆయా నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోస్తున్న వారిని, సీనియర్లను పక్కన పెట్టేందుకు రెండు పార్టీలూ సిద్ధమవుతున్నాయి. రెండు పార్టీల అధిష్టానాలూ తమను వాడుకుని వదిలేయడంపై ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు మండిపడుతున్నారు.

టికెట్టు వస్తుందా.. రాదా..
జిల్లాలోని రాజోలు, పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం లోక్‌సభ స్థానం ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. మిగిలిన కొత్తపేట, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గాలు జనరల్‌ కాగా, వీటిలో రామచంద్రపురం, ముమ్మిడివరం స్థానాల్లో బీసీల ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ కారణంగా జిల్లాలో సీట్ల కేటాయింపులో ఎస్సీ, బీసీలకు తప్పనిసరిగా ప్రాధాన్యం కల్పించాల్సి ఉంది. అయితే, జిల్లాలో ఎస్సీలకు తప్పనిసరిగా కేటాయించాల్సిన స్థానాల్లోను, బీసీలకు ఇవ్వాలనుకుంటున్న చోట్ల టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటి వరకూ సీట్ల సర్దుబాటు జరగలేదు. కానీ, మొత్తం ఏడు సీట్ల నుంచీ పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలూ ఆశతో ఉన్నారు.

పొత్తుల వల్ల తమ స్థానాలు కోల్పోతామనే భయం ఆ పార్టీల నియోజకవర్గ ఇన్‌చార్జిలను, ఆశావహులను ఒకవైపు వెంటాడుతోంది. మరోవైపు పొత్తుల్లో తమ పార్టీకి అవకాశం వచ్చినా టికెట్టు తమకు వస్తుందనే భరోసా వారికి లేకుండా పోయింది. అభ్యర్థి వ్యక్తిగత బలంకన్నా, ఆర్థిక బలమే గీటురాయిగా మారడంతో వీరికి టికెట్టు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా దళిత, బీసీ నేతలకు సీటు వస్తుందనే భరోసా లేకుండా పోయింది. ఇదే సమయంలో మండపేట నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కొత్తపేట, ముమ్మిడివరం నుంచి టీడీపీ నుంచి టికెట్లు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేస్తూండటం గమనార్హం.

ప్చ్‌.. టీడీపీలో భరోసా లేదు
రాజోలు అసెంబ్లీ స్థానానికి గత ఎన్నికల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గొల్లపల్లి సూర్యారావు పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే, ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో గొల్లపల్లి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. ఆయన పి.గన్నవరం సీటు ఆశిస్తున్నా టీడీపీ అధిష్టానం నుంచి భరోసా లేదు.

అమలాపురం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తిరిగి పోటీ చేయాలని అనుకుంటున్నా మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వర్గం వ్యతిరేకిస్తోంది. దీనికితోడు సొమ్ములు లేవనే కారణంతో ఆనందరావును పక్కన పెట్టనున్నారు. అలాగే పార్లమెంటరీ ఇన్‌చార్జి గంటి హరీష్‌ మాధుర్‌ను ఇక్కడి నుంచి పోటీలో పెట్టాలని భావిస్తున్నందున ఆనందరావుకు ఝలక్‌ తగలనుంది. అలాగే, ఇక్కడ నుంచి సీటు ఆశించి, ఐదేళ్లుగా పార్టీకి డబ్బులు ఖర్చు చేసిన పరమట శ్యామ్‌కుమార్‌, పోతుల సుభాష్‌చంద్రబోస్‌ వంటి వారిని కాదని, కొత్తగా పార్టీలోకి వస్తున్న కోటీశ్వరుల వైపు అధిష్టానం చూస్తోందని చెబుతున్నారు.

గంటి హరీష్‌ మాధుర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ పార్లమెంట్‌కు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే, ఆర్థికంగా స్థితిమంతుడు కాకపోవడంతో ఆయనను తప్పించి, అమలాపురం లేదా పి.గన్నవరం నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై హరీష్‌ కినుక వహించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన పాము సత్యశ్రీ లేదా పార్టీలో చేరనున్న ఒక పారిశ్రామికవేత్తను పార్లమెంట్‌కు పంపాలని టీడీపీ భావిస్తోంది.

టీడీపీలో బీసీ సీనియర్‌ నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్‌ఎస్‌)కు సైతం సీటు భరోసా లేదు. ప్రస్తుతం ఆయన రామచంద్రపురంలో పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ముమ్మిడివరంలో దాట్ల బుచ్చిబాబుకు ఇచ్చేందుకు రామచంద్రపురం సీటును జనసేనకు త్యాగం చేస్తున్నట్టు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీడీపీకి ఇక్కడ సీటు కేటాయించినా కాపు సామాజికవర్గానికి చెందిన రాయపురెడ్డి సూరిబాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

జనసేనదీ అదే దారి
జనసేనలో సైతం దళితులు, బీసీ నేతలు కరివేపాకుల్లా మారనున్నారు. అమలాపురం అసెంబ్లీ నుంచి సీటు ఆశిస్తున్న శెట్టిబత్తుల రాజబాబు, డీఎంఆర్‌ శేఖర్‌లలో ఒక్కరికి కూడా పార్టీ నుంచి స్పష్టమైన భరోసా లేదు. ఈ సీటు టీడీపీకి ఇస్తారని, బాలయోగి కుమారుడు గంటి హరీష్‌ మాధుర్‌ను బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో గడచిన ఏడేళ్లుగా పార్టీలో తిరుగుతున్న రాజబాబు, శేఖర్‌లకు మొండిచేయి చూపినట్టే. గత ఎన్నికల్లో శేఖర్‌ ఎంపీగా పోటీ చేస్తే, రాజబాబు అసెంబ్లీకి పోటీ చేశారు. అయినప్పటికీ వీరికి ప్రాధాన్యం లేకుండా పోయింది.

ఇక జనసేన పీఏసీ సభ్యుడు, గత ఎన్నికల్లో పార్టీ తొలి అభ్యర్థి, బీసీ సామాజికవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ పరిస్థితి మరీ దారుణం. గత ఎన్నికల్లో ఆయన ముమ్మిడివరం నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయనకు అక్కడ అవకాశం లేనట్టేనని టీడీపీతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు ఈ సీటు ఇచ్చేందుకు వీలుగా బాలకృష్ణను రామచంద్రపురం వెళ్లాల్సిందిగా అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు కోరుతున్నట్టు తెలిసింది. సొంత ప్రాంతం వదిలి వెళ్లేందుకు బాలకృష్ణకు ఇష్టం లేకున్నా మరో ప్రత్యామ్నాయం లేదు. అలాగని రామచంద్రపురం అయినా ఇస్తారనే భరోసా కూడా లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement