మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం ఆదివారం భక్తులతో శోభిల్లింది. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2.90 లక్షల ఆదాయం వచ్చింది. లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2.03 లక్షలు, నిత్యాన్నదానానికి రూ.86,380 విరాళాలుగా అందించారు. అమ్మవార్లకు భక్తులు సమర్పించిన చీరల వేలం పాటల ద్వారా రూ.28 వేలు సమకూరింది. 5,873 మంది భక్తులు దేవస్థానాన్ని దర్శించుకోగా 4,269 మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్టుకు పెద్దాపురం మండలం రామేశ్వరానికి చెందిన వద్దిపర్రు జగన్నాథమూర్తి రూ.25 వేలు, విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన పిల్లా రామకృష్ణ రూ.10 వేల విరాళం సమర్పించారు. దాతలకు ఆలయ ఈఓ జి.శ్రీదేవి, ధర్మకర్తల మండలి చైర్మన్ చిట్టూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ట్రస్టు బోర్డు సభ్యులు చిట్టాల సత్తిబాబు, కొమ్ముల సూరిబాబులు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
మది మురిసే..
ఆధ్యాత్మికత విరిసే
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. కార్తిక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి పలువురు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అయ్యప్ప, భవానీ దీక్షాధారులు రావడంలో ఆలయ ఆవరణ కిక్కిరిసింది. సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని పూజలు చేశారు. 15 వేల మంది భక్తులు తరలివచ్చినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. క్యూలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా తగిన చర్యలు చేపట్టారు. భక్తులకు తాగునీరు అందించడంతో పాటు నిత్యాన్నదాన పథకంలో భోజనం పెట్టారు.
మల్లేశ్వరునికి
వెండి ధారాపాత్ర సమర్పణ
మామిడికుదురు: మొగలికుదురులోని పార్వతీ మల్లేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి అదే గ్రామానికి చెందిన పోచెట్టి సూరిబాబు వెండి ధారాపాత్రను సమర్పించారు. రూ.1.10 లక్షలతో తయారు చేయించిన ఈ ధారాపాత్రను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం వెండి ధారాపాత్రతో స్వామివారికి అభిషేకాలు చేశారు. అనంతరం లక్ష బిల్వార్చన వైభవంగా జరిగింది. ఈదరాడలోని ఉమా సోమేశ్వరస్వామి ఆలయంలోనూ లక్ష బిల్వార్చన పూజ చేశారు.
మాల మహానాడు
జిల్లా అధ్యక్షుడిగా మణిరాజు
మామిడికుదురు: జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా నగరం గ్రామానికి చెందిన బొంతు మణిరాజును నియమించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనరాజు నుంచి తనకు నియామక ఉత్తర్వులు అందాయని మణిరాజు ఆదివారం వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానంతో, మాల మహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు ఆశయ సాధన కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. సంఘ ప్రముఖుల సూచనలు, సలహాలతో మాల మహానాడును తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని వివరించారు.
అంతర్వేది ఆలయంలో భక్తజన సందోహం
దాత జగన్నాథమూర్తికి స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఈఓ మాధవి
మొగలికుదురులో మల్లేశ్వరస్వామికి ధారాపాత్ర సమర్పిస్తున్న సూరిబాబు


