కోడి పందేలకు అనుమతి లేదు
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం టౌన్: సంక్రాంతి పండగల పేరుతో కోడి పందేలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అనుమతించేది లేదని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. వీటిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. శనివారం అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో జిల్లా నేర సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ మీనా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న స్పాట్‌లను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులపై పోలీస్ స్టేషన్ల వారీగా ఎస్పీ సమీక్షించారు. సంక్రాంతి పండగకు ఇచ్చే సెలవులకు జిల్లాలోని పలు కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్తారని చెప్పారు. ఈ క్రమంలో దొంగతనాలకు ఆస్కారం లేకుండా పోలీస్ గస్తీని పెంచాలని సూచించారు. ప్రజలు కూడా పండగ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, రఘువీర్, జిల్లా ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, డీసీఆర్‌బీ సీఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


