ర్యాలి క్షేత్రాన్ని సందర్శించిన సరస్వతీ స్వామీజీ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవ, గోపాలస్వామివారి ఆలయాన్ని పెనుగొండ వాసవీ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతీ (బాల) స్వామీజీ శనివారం సందర్శించారు. స్వామీజీకి దేవస్థానం ఈఓ భాగవతులు వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శనికి ప్రీతికరమైన శనివారం పురస్కరించుకుని దేవస్థానం దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,47,105, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.80,800, అన్న ప్రసాద విరాళాల రూపంలో రూ.23,222 ఆదాయం వచ్చినట్టు ఈఓ వివరించారు.
జాతీయ స్థాయి
వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక
అమలాపురం టౌన్: విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా చాటి త్వరలో ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికై న అమలాపురం మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులను డీఈఓ పి.నాగేశ్వరరావు అభినందించారు. ఫుట్ ప్రెస్ పవర్ జనరేటర్ పేరుతో ప్రాజెక్ట్ తయారు చేసిన విద్యార్థులు ఎన్.సత్య ప్రవీణ్, పి.సిద్ధార్థ్‌లను, గైడ్ టీచర్ పీవీఎల్‌ఎన్ శ్రీరామ్‌ను ఆ పాఠశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో డీఈఓ ప్రత్యేకంగా అభినందించారు. ప్రాజెక్ట్ పనిచేసే విధానాన్ని డీఈఓ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలోనూ ఈ ప్రాజెక్ట్ విజేతగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. పాఠశాల హెచ్‌ఎం కె.ఘన సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఎంఎస్‌డీ భవాని, బీఎన్ వెంకటేశ్వరరావు, కేఆర్‌ఎన్ ప్రసాద్, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శృంగార వల్లభుని ఆలయానికి
భక్తుల తాకిడి
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,20,860, అన్నదాన విరాళాలు రూ.61,519, కేశ ఖండన ద్వారా రూ.3 వేలు, తులాభారం ద్వారా రూ.300, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19,035లతో కలిపి రూ.2,04,714 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,200 మంది భక్తులు ఆలయంలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.
ర్యాలి క్షేత్రాన్ని సందర్శించిన సరస్వతీ స్వామీజీ
ర్యాలి క్షేత్రాన్ని సందర్శించిన సరస్వతీ స్వామీజీ


