2025..అంతా చేదు | - | Sakshi
Sakshi News home page

2025..అంతా చేదు

Dec 28 2025 8:32 AM | Updated on Dec 28 2025 8:32 AM

2025.

2025..అంతా చేదు

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

చిన్నారులపై వరుస అఘాయిత్యాలు నిందితుల్లో ఇద్దరు టీడీపీ, జనసేన నాయకులు

పెరిగిన రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ క్రైమ్‌లు ఈ ఏడాదంతా జిల్లాలో కన్నీటి ఘటనలే

అమలాపురం టౌన్‌: రక్తమోడిన రహదారులు.. నేరాలు.. ఘోరాలు.. బాలికలపై అత్యాచారాలు.. హత్యలు.. ఇలా ఈ ఏడాది అంతా కన్నీరే మిగిల్చింది. జిల్లాలో 2025 సంవత్సరం చేదు అనుభవాలను మూటగట్టింది.. ముఖ్యంగా బాలికలపై వరుస అఘాయిత్యాలు అంతటా కలకలం రేపింది. ఈ అత్యాచారాలకు సంబంధించి రెండు కేసుల్లో ఇద్దరు నిందితులు టీడీపీ, జనసేన నాయకులు కావడం మరింత ఆందోళనకు గురిచేసింది. పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లో నదీ పాయల్లో 11 మంది మృత్యువాత పడడం ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అలాగే సైబర్‌ నేరాల్లో రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు ఆందోళనే మిగిలింది.. పలు హత్య కేసులు సంచలనమయ్యాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఘటనలే జరిగాయి.

చితికిపోయిన బాల్యం

● అక్టోబర్‌ 25న ఐ.పోలవరం మండలం బాణాపురం జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై జనసేన పార్టీ నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ (బాబి) అత్యాచారం చేసినట్లు నేరారోపణ ఎదుర్కొన్నారు. ఈ కేసు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగించింది.

● ఈ నెల 3న ముమ్మిడివరం మండలం ఠాణేలంక గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలికపై టీడీపీ నాయకుడు మోర్త గిరిబాబు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది.

● 7న ముమ్మిడివరం గ్రామంలో పదో తరగతి చదివిన ఓ బాలికపై అత్యాచారం జరిగింది.

● 13న ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన ఓ బాలికపై అతని తండ్రి కామవాంఛ తీర్చుకుంటూ కొన్ని నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ నాలుగు సంఘటనలు (బాలికలపై అత్యాచారాలు) అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో జరగడం జిల్లా ప్రజలను ఆందోళన కలిగించాయి.

నదీ పాయలు.. మృత్యుకుహరాలు

● ఆగస్ట్‌ 26న ముమ్మిడివరం మండలం కమిని వద్ద నదీ స్నానాలకు వెళ్లిన ఎనిమిది మంది యువకులు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ఆ యువకులంతా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వారే కావడం, వారి చదువుకుని ప్రయోజకులు అవుతారని ఎదురు చూసిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది.

● మే 27న పి.గన్నవరం మండలం నాగుల్లంక, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా నదీ పాయలోకి స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిలంకలోని నదీ పాయలోకి స్నానానికి వెళ్లి ఈతరాక ప్రాణాలు వదిలారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆయా కుటుంబాలకు ఏకై క కుమారులు కావడం ఆ కుటుంబాలను మరింత కుంగదీసింది.

సైబర్‌ నేరం చేసి..

సొమ్ము కాజేసి

● ముమ్మిడివరం నియోజకవర్గంలో ఓ విశ్రాంత మండల విద్యాశాఖాధికారి సైబర్‌ నేరం బారిన పడి రూ.34.60 లక్షలు పోగొట్టుకున్నారు.

● మండపేట పట్టణంలో ఓ హోటల్‌లో ఫుడ్‌ బుకింగ్‌ సమయంలో ఓటీపీలు చెప్పడంతో రూ. 80 వేల డబ్బును నేరగాళ్లు దోచుకున్నారు.

● ఉప్పలగుప్తం మండలం పేరాయిచెరువు గ్రామంలో మహిళలకు సైబర్‌ నేరగాళ్లు వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగాన్ని ఆశ చూపి ఆమె వద్ద నుంచి రూ.8.50 లక్షలు కాజేశారు.

● అమలాపురంలో క్రిడెట్‌ స్కోర్‌ పెంపు పేరుతో ఓ వ్యక్తి రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు. దక్షిణా ఆఫ్రికా ప్రయాణ లగేజీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఆ సొమ్ము కాజేశారు.

వేగం.. బలిగొన్న ప్రాణం

● సెప్టెంబర్‌ 23న తాళ్లరేవు మండలం పెదవలసల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌పై వేగంగా వెళ్తున్న వీరు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

● ఈ నెల 17న అమలాపురం 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అతివేగం కారణంగా బైక్‌పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. ఇలా జిల్లాలో అనేక ప్రమాదాలు జరిగాయి.

సంచలనమైన హత్య కేసు

అక్టోబర్‌ 28న అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను అనే డ్రైవర్‌ హత్య కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. అమలాపురానికి చెందిన ఓ మాజీ రౌడీ షీటర్‌, మరో నలుగురు కలసి శ్రీనును హత్య చేసి పి.గన్నవరం మండలం ఆర్‌.ఏనుగుపల్లి నదీపాయల వద్ద మృతదేహాన్ని పాడేశారు. భర్త ఆచూకీ కోసం శ్రీను భార్య, కుటుంబ సభ్యులు ధర్నాలు చేశారు. ఎస్పీకి ఫిర్యాదులు చేసే వరకూ వెళ్లింది.

గంజాయి.. ఆగలేదోయ్‌

● జిల్లాలో పలు గంజాయి కేసులు ఈ ఏడాదిలో నమోదయ్యాయి. నవంబర్‌ 9న రాజోలులో గంజాయి విక్రయ కేసులో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏకంగా ఈ ఆరుగురు ఇన్‌స్ర్ట్రాగామ్‌ ద్వారా తమ స్మార్ట్‌ ఫోన్లలో గ్రూప్‌ను క్రియేట్‌ చేసి గంజాయిని విక్రస్తున్నారు. వీరి అక్రమ వ్యాపారాలకు యువకులు అనేక మంది బలయ్యారు.

● ఈ నెల 23న కె.గంగవరం మండలం కోటిపల్లి శివారు ఏటిగట్టుపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చైన్‌ స్నాచింగ్‌లు.. దోపిడీలు

● రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నవంబర్‌ నెలలో రెండు చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదు అయ్యాయి.

● అమలాపురంలో ఈ ఏడాదిలో చైన్‌ స్నాచింగ్‌ కేసు నమోదైంది. దీంతో ఇంట్లో మహిళలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోయారు.

● అమలాపురంలో గత నెలలో జరిగిన చోరీలో అంతర్రాష్ట్ర దొంగ దొరికాడు.

● సెప్టెంబర్‌ 11న కపిలేశ్వరపురంలో ఓ ఇంట్లో జరిగిన చోరీలో కేసులో రూ.3.8 లక్షల సొత్తును దోచుకున్నారు.

● అక్టోబర్‌ 1న అయినవిల్లి మండలం విలస గ్రామంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో భార్యభర్తలు ప్రాణాలు విడిచారు.

● అదృశ్యం కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అమలాపురం పట్టణంలో ఈ ఏడాది నాలుగు కే సులు నమోదయ్యాయి. కంచిపల్లి శ్రీనుది ముందు అదృశ్యం కేసు నమోదు చేయగా, అతను హత్యకు గురికావడంతో అది హత్య కేసుగా మార్చారు.

జీవితాల్లో ‘పేలుడు’

రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో అక్టోబర్‌ 7న జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బాణసంచా తయారీ కేంద్రం యాజమానితో సహా కేంద్రంలోని పనిచేసే తొమ్మిడి మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఏ రోజుకా రోజు కూలి సొమ్ముతో జీవించే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పట్లో ఈ ప్రమాదం జిల్లాలో సంచలనమైంది. బాణసంచా తయారీ కేంద్రాల్లో సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి అంత మంది మృతికి కారణమైంది. అధికారులు, ప్రభుత్వ వైఫల్యం కనిపించింది. ఇదే ఈ ఏడాది జిల్లా పెద్ద ఘటనగా చెప్పవచ్చు.

2025..అంతా చేదు1
1/3

2025..అంతా చేదు

2025..అంతా చేదు2
2/3

2025..అంతా చేదు

2025..అంతా చేదు3
3/3

2025..అంతా చేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement