రైల్వే లైన్‌ను త్వరితగతిన పూర్తి చేయించండి
అమలాపురం టౌన్: కోనసీమ రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఎంపీ గంటి హరీష్ మాధుర్ దృష్టికి కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధుల బృందం తీసుకు వెళ్లింది. కేఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి అయిన ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో కూడిన స్టీరింగ్ కమిటీ బృందం ఎంపీని అమలాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసింది. కేవలం 57 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే లైనుకు పూర్తి స్థాయిలో స్థల సేకరణ జరగలేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, కేఆర్‌ఎస్‌ఎస్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణం తదితరులు అన్నారు. లైన్ అలైన్‌మెంట్ విషయంలోనే ఇంకా తర్జనభర్జనలు జరుగుతున్నాయన్నారు. 23 ఏళ్ల కిందట అమలాపురం సర్క్యులర్ బజార్ షాపుల్లో నెలకొల్పిన రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ కౌంటర్‌ను రెండేళ్ల కిందట మూసి వేశారని గుర్తు చేశారు. దీనిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ కోనసీమలోని మూడు నదీపాయలపై ఇప్పటికే రైల్వే వంతెనల నిర్మాణం జరుగుతోందని, ఈ ప్రాజెక్ట్‌కు న్యాయపరమైన చిక్కులు దాదాపు తొలగాయని, జాయింట్ సర్వే పూర్తి కావొచ్చిందని వివరించారు. కమిటీ ప్రతినిధులు కల్వకొలను తాతాజీ, ఆర్‌వీ నాయుడు, వంకాయల రాజా, ఎరగర్త వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకున్న ప్రతి మదీ మురిసింది. ప్రాతః కాలంలో స్వామివారి తొలి హారతి అంగరంగ వైభవంగా జరిగింది. బాల బాలాజీ స్వామివారికి మంగళాశాసనం నిర్వహించారు. గోదాదేవికి తిరుప్పావై సేవాకాలం ఘనంగా జరిపించారు. భక్తులు స్వామి వారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,29,082 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.89,083 విరాళాలుగా సమర్పించారన్నారు. స్వామివారిని 4,700 మంది దర్శించుకోగా, 2,800 మంది అన్నప్రసాదం స్వీకరించారన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు.


