ప్రభల ఉత్సవాలకు సకల ఏర్పాట్లు
కలెక్టర్ మహేష్‌కుమార్
అంబాజీపేట: మొసలపల్లి జగ్గన్నతోటలో ఏకాదశ ప్రభల ఉత్సవాలకు సకల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ప్రభల తీర్థం జరిగే జగ్గన్నతోటలో శనివారం ఆయన పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ జగ్గన్నతోట ప్రభల తీర్థం అత్యంత పురాతన, పవిత్ర తీర్థ స్థలంగా పేరొందిందన్నారు. కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మండల, క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభలు తరలివెళ్లే మార్గాలను పరిశీలించారు. అప్పర్ కౌశిక దాటే ప్రభల వివరాలపై కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్, అంబాజీపేట తహసీల్దార్ బి.చినబాబు, ఎంపీడీఓ బి.మమతలను అడిగి మ్యాప్ ద్వారా ఆరా తీశారు.
శాంతికి ప్రతీక క్రిస్మస్
అమలాపురం రూరల్: ప్రేమ, శాంతి, సేవా భావాలకు ప్రతీకగా క్రిస్మస్ నిలుస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఈవ్ హైటీ కార్యక్రమాన్ని క్రైస్తవ మత పెద్దలతో నిర్వహించారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, డీఆర్వో కె.మాధవి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీల్, వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఊడిమూడిలంక వంతెన 65 శాతం పూర్తి
పి.గన్నవరం: నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై ఊడిమూడిలంక వద్ద రూ.71.43 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు 65 శాతం పూర్తయ్యాయని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇంత వరకూ జరిగిన పనుల ప్రగతిని పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్స్ విభాగం డీఈఈ అన్యం రాంబాబు వివరించారు. 2026 వరదల సీజన్ నాటికి లంక గ్రామాల ప్రజలు వంతెనపై నడిచి వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అని కలెక్టర్ ప్రశ్నించారు. అప్పటికి అన్ని ఫిల్లర్లు, గడ్డర్ల నిర్మాణాలు మాత్రమే పూర్తవుతాయన్నారు. 2027 మార్చి నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని రాంబాబు వివరించారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విదితమే.


