పార్థుని సంస్కారం ప్రశంసనీయం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పార్థుని సంస్కారం ప్రశంసనీయమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆయన శనివారం హిందూ సమాజంలో 31వ రోజు విరాట పర్వ ప్రవచనం ముగించి, ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. పాండవులు తన వద్దనే అజ్ఞాతవాసం ముగించారని తెలుసుకున్న విరాటరాజు ఆనందభరితుడవుతాడు. తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవాలని అర్జునుడిని కోరతాడు. అర్జునుడు దానిని అంగీకరించక, ఉత్తరను కోడలిగా చేసుకుంటానని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ‘ఏడాది పాటు ఉత్తరకు నాట్యం నేర్పాను, ఆమె నన్ను ఆచార్యునిగా, తండ్రిగా భావించింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం నా నడవడిని శంకిస్తుంది. ఆమెను కోడలిగా చేసుకుంటే నన్నుగానీ, నీ కుమార్తెను గానీ ఎవరూ శంకించరు. నేనులోకాపవాదుకు భయపడతాను’ అన్న అర్జునుని ఉత్తమ సంస్కారం మనకు ఆదర్శం కావాలని సామవేదం అన్నారు. ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వం ముగిసింది. సినిమాల్లో చూపినట్లు వివాహానికి ముందు ఉత్తరాభిమన్యులు యుగళగీతాలను పాడుకోలేదని ఆయన అన్నారు.
నేడు సామవేదంకు బ్రహ్మజోస్యుల పురస్కారం
ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గాంధేయవాది, సీతానగరం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని సామవేదం షణ్ముఖశర్మ అందుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతానగరం కస్తూర్బా ఆశ్రమంలో సామవేదం పురస్కారాన్ని అందుకుంటారని భాగవత విరించి టీవీ నారాయణరావు వేదికపై వివరాలను వెల్లడించారు.


