
కొవ్వూరు: అగ్రి ఫెస్టివల్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బరోడా కిసాన్ పఖ్వాడా ద్వారా 10 వేల మంది రైతులకు సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కిసాన్ పఖ్వాడాను కొవ్వూరులోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ, అగ్రి ఫెస్టివల్ పేరిట వ్యవసాయ కార్యక్రమాలతో పాటు వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, పథకాలపై రెండు వారాల పాటు బ్యాంకు అవగాహన కల్పిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రూ.1.35 కోట్లు ఇన్సూరెన్సు కవరేజీను బ్యాంకు ఆఫ్ బరోడా ప్రవేశపెట్టిందని చెప్పారు. అసాధారణమైన ఈ ప్యాకేజీని వినియోగించుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ సందర్భంగా పోలీసు జీతాల ప్యాకేజీకి ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూను మంత్రి ఆవిష్కరించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) దినేష్‌పంత్ మాట్లాడుతూ, మేళా ద్వారా లబ్ధిదారులకు రూ.101 కోట్ల రుణ మంజూరు పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు. బ్యాంక్ హైదరాబాద్ జోన్‌లో 413 శాఖలున్నాయని, వీటిలో 207 సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి అందించిన రుణాలు సెప్టెంబర్ 30 నాటికి 21 శాతానికి పెరిగాయన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.
హైదరాబాద్ జోనల్ హెడ్ రీతేష్ కుమార్ మాట్లాడుతూ, జోన్‌లో ఈ ఏడాది 50 పైగా బరోడా బ్యాంకు శాఖల ద్వారా రైతు సమావేశాలు, కిసాన్ మేళా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గత ఏడాది హైదరాబాద్ జోన్‌లో కిసాన్ పఖ్వాడా సందర్భంగా 300కు పైగా కిసాన్ మేళాలు, ఈవెంట్లు నిర్వహించామని, రూ.288 కోట్ల వ్యవసాయ రుణాలు అందించామని తెలిపారు. రైతులకు మరింత చేరువై ఘర్–ఘర్ కేసీసీ అభియాన్ పేరుతో కిసాన్ క్రెడిట్ కార్డుల డ్రైవ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పథకాలను ప్రోత్సహించడానికి కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు. అంతకు ముందు ఫంక్షన్ హాలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి వనిత ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పోసిన శ్రీలేఖ, బ్యాంకు ఎన్‌డీజీఎం ఎంవీఎస్ సుధాకర్, డిప్యూటీ జీఎం చందన్ సాహో, ఏజీఎం కె.విజయరాజు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ ఏంఎంసీ చైర్మన్ బండి పట్టాభి రామారావు, అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర, గోపాలపురం ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హోం మంత్రి తానేటి వనిత
లబ్ధిదారులకు రూ.101 కోట్ల రుణ మంజూరు పత్రాల పంపిణీ
కిసాన్ ఫఖ్వాడా ద్వారా
10 వేల మంది రైతులకు చేరువ
కొవ్వూరులో బ్యాంకు పక్షోత్సవాలు ప్రారంభం