మన కుటుంబం – మన కార్యకర్తతో కేడర్‌కు ధైర్యం చెప్పిన బొత్స అనూష
చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలిచిన సీనియర్ నాయకుడు, వైఎస్సార్‌సీపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో నియోజకవర్గ వ్యవహారాలను ఆయన కుమార్తె డాక్టర్ బొత్స అనూష సమర్థంగా నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను నిత్యం కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు.
బొత్స రాజకీయ వారసురాలిగా అనూష
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాల వరకూ బొత్స సత్యనారాయణది ఘనమైన రాజకీయ ప్రస్థానం. అలాంటి నాయకుడి వారసత్వాన్ని కొనసాగించడం చిన్న విషయం కాదు. అయితే, బొత్స రాజకీయ వారసురాలిగా డాక్టర్ అనూష పూర్తిగా అర్హురాలేనన్న అభిప్రాయం వైఎస్సార్‌సీపీ కేడర్‌లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల పార్టీ పిలుపునిచ్చిన వివిధ కార్యక్రమాలను బొత్స సత్యనారాయణ తరఫున అనూష సమర్థంగా నిర్వహించారని పార్టీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ తన తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా ముందుకెళ్తున్నారని అనుచరులు నమ్మకంగా ఉన్నారు.
రాజకీయ వారసత్వంతో పాటు బొత్స బ్రాండ్ నేమ్‌ను మరింత బలోపేతం చేసేలా అనూష వ్యవహారశైలి ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇతర నాయకులకంటే భిన్నంగా ఆలోచిస్తూ, ప్రజలతో నేరుగా మమేకమవడం ఆమె ప్రత్యేకతగా మారింది. పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, విడిగా ప్రజా సమస్యలు, కార్యకర్తల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలోనూ అనూష వినూత్నంగా వ్యవహరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చీపురుపల్లిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మన కుటుంబం – మన కార్యకర్తతో గడపగడపకూ
మన కుటుంబం మన కార్యకర్త పేరిట చీపురుపల్లి నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకూ వెళ్లాలని నిర్ణయించారు. జనవరి 18 నుంచి మొదలైన ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కార్యకర్తల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, పార్టీ అధికారంలో లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. పార్టీ పిలుపు ఇచ్చినప్పుడే కాకుండా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో అనూష ముందుకెళ్తున్నారు.
బొత్స సతీమణి గతంలో జెడ్పీటీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. రానున్న లోకల్ ఎలక్షన్స్‌లో పట్టుకోసం బొత్స అనూషని పోటీలో నిలిపేందకు ఏమైనా స్ట్రాటజీ అప్లై చేయనున్నారా? లేదంటే బొత్స అనూషతో కొత్త ప్లాన్ ఏమైనా రెడీ చేస్తున్నారా? అన్నది చీపురుపల్లి పార్టీ కార్యకర్తలు, బొత్స అభిమానులు చర్చించుకుంటున్నారు.


