జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పి.టి మండ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కొండగొర్రి సాయి సార్విని మలేరియా, పచ్చ కామెర్లు వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్ను మూసింది. కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు కొండగొర్రి నూకం దొర, జయశ్రీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల కురుపాం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అంజలి, కల్పన, కవితలే కాకుండా పలువురు గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకం ఏమైందో కానీ ఇప్పటి వరకు ఒక్క ఆరోగ్య కార్యకర్తను వేసిన దాఖలాలు లేవని, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో, వసతిగృహాల్లో ఆరోగ్య కార్యకర్తను వేసి ఉంటే ఇంత మంది గిరిజన విద్యార్థుల చావులు ఉండేవి కాదని తమ కుమార్తె జ్వరమే అనుకున్నాం కానీ పచ్చకామెర్లు వచ్చిన సంగతి గుర్తించలేక పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకాన్ని నిలబెట్టుకుంటే ఇంతమంది గిరిజన విద్యార్థులు చనిపోయేవారు కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. చనిపోయిన విద్యార్థిని సాయి సార్విని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


