షేడ్‌నెట్స్‌ ఏర్పాటులో..నత్తే నయం..! | - | Sakshi
Sakshi News home page

షేడ్‌నెట్స్‌ ఏర్పాటులో..నత్తే నయం..!

Mar 8 2026 7:14 AM | Updated on Mar 8 2026 7:14 AM

షేడ్‌నెట్స్‌ ఏర్పాటులో..నత్తే నయం..!

విజయనగరం ఫోర్ట్‌: ఆధునాతన వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన షేడ్‌ నెట్‌ పథకం లక్ష్యానికి అనుగుణంగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్‌ షేడ్‌ నెట్‌ పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో చేపడుతున్నట్టు గొప్పగా చెప్పారు. కానీ వాటి ఏర్పాటులో శ్రద్ద చూపడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్ష్యంలో సగం కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ లక్ష్యం నేరవేరడం లేదు. స్వయం సహాయక సంఘాల మహిళల (డ్వాక్రా మహిళ)తో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వీటి ఏర్పాటుకు రాయితీ లేకపోవడంతో మహిళలు ముందుకు రావడం లేదు.

ఆసక్తి చూపని లబ్ధిదారులు

షేడ్‌ నెట్‌ యూనిట్లను 400 –500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేసేలా రుపొందించారు. అందుకుగాను రూ.2.15 లక్షల ఖర్చు అవుతుంది. రూ.లక్ష వరకు రాయితీ వర్తిస్తుందని, మిగిలిన మొత్తం సెర్ప్‌ ద్వారా రుణంగా ఇస్తారని గతంలో వెల్లడించారు. వీటి ఏర్పాటును కేతి అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. గతంలో 450 మంది షేడ్‌ నెట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. 78 మందికి ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు రావని తెలియడంతో వారు కూడా ఆగిపోయారు.

వ్యయం తగ్గించినా అదే పరిస్థితి

షేడ్‌ నెట్‌ వ్యయం రూ.2.15 లక్షలతో ఏర్పాటు చేయడానికి మహిళలు ముందుకు రాకపోవడంతో ఆ వ్యయాన్ని తగ్గించారు. అయినప్పటకీ అదే పరిస్థితి ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 50 శాతం వరకు వ్యయాన్ని తగ్గించారు. 6, 10 సెంట్లు రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆరు సెంట్లుకు రూ.1,04,400 లు, 10 సెంట్లుకు రూ.1,37,100 గా నిర్ణయించారు. వెలుగు, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, సీఐఎఫ్‌ ద్వారా వడ్డీకి రుణాలు ఇస్తుంది. 100 యూనిట్లకుగాను ఇప్పటి వరకు 42 ఏర్పాటు చేశారు. మార్చి నెలఖారులోగా వీటిని పూర్తి చేయాల్సి ఉంది. అయితే గడువు కేవలం 23 రోజులే ఉంది. మరి శతశాతం షేడ్‌ నెట్స్‌ ఏర్పాటు చేస్తారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. షేడ్‌ నెట్‌ ఏర్పాటుకు లబ్ధిదారులు రూ.34,100 భరించాల్సి ఉంటుంది.

షేడ్‌ నెట్స్‌లో పండించేవి..

షేడ్‌ నెట్స్‌లో కూరగాయాలు, ఆకుకూరలు, పువ్వులు, నారు పెంచుతారు. షేడ్‌ నెట్‌లో పండించడం వల్ల అధిక ఎండ, వేడి పంటలను మొక్కలను రక్షిస్తుంది. 75 శాతం వరకు రాయితీ ఇస్తుంది. నేల నుంచి తేమ ఆవిరి కాకుండా తగ్గిస్తుంది. దీని వల్ల నీటి అవసరం తగ్గుతుంది. పక్షులు, కీటకాలు, వడగండ్ల నుంచి పంటలను రక్షిస్తుంది. కావాల్సినంత కాంతి, తేమను అందించడం ద్వారా పూలు, పండ్లు, కూరగాయాలు నాణ్యత పెరుగుతుంది.

రాయితీ లేకపోవడంతో ముందుకు

రాని మహిళలు

100 యూనిట్లకుగాను 42 మాత్రమే ఏర్పాటు

ఇంకా 23 రోజులే గడువు

42 ఏర్పాటు

ఇప్పటి వరకు జిల్లాలో 42 షేడ్‌ నెట్స్‌ ఏర్పాటు చేశాం. మిగతావి కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసపాణి, డీఆర్‌డీఏ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement