కొత్తవలస : మండలంలోని కొత్తవలస – విజయనగరం రహదారిలో అర్ధన్నపాలెం గ్రామ జంక్షన్ సమీపంలో శనివారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ అప్పికొండ పరదేశి(38) అక్కడికక్కడే మృతి చెందాదు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అప్పికొండ పరదేశి కొత్తవలస ప్రాంతంలో సర్వీసు చేసుకొని మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు అర్ధన్నపాలెం జంక్షన్ సమీపంలో ఆటోను ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం, ఆటో పూర్తిగా నుజ్జయ్యాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ పరదేశి తుళ్లిపడి రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే 108 వాహనానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108 వాహనానికి ఫోన్ చేయగా అందుబాటులో లేదని సిబ్బంది సమాధానం చెప్పారు. సుమారు అర్ధ గంటకు పైగా క్షతగాత్రుడు రోడ్డుపై ఉండిపోయి అధిక రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య శశి, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె రేష్మ, మూడో తరగతి చదువుతున్న జైరామ్ ఉన్నారు. భార్య రేష్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ జోగారావు తెలిపారు.


