విజయనగరం క్రైమ్: ఫేస్‌బుక్‌లో పరిచయంతో ఓ యువకుడికి గాలం వేసి, బంగారు చైన్‌ను దోచుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తంపురానికి చెందిన పాండ్రంకి కిరణ్, ఉష భార్యాభర్తలు. భర్త కిరణ్ సోషల్ మీడియాలో ప్రొఫైల్స్‌ను పరిశీలించి, ఎంపిక చేసుకున్న కొంతమంది వ్యక్తులకు యువతిగా నమ్మించి మెసేజ్‌లు చేస్తారు. వారితో పరిచయం పెరిగాక దగ్గర ఉండి తన భార్య ఉషతో వాట్సాప్‌కాల్ మాట్లాడిస్తాడు. ఆ ట్రాప్‌లోనే భీమిలికి చెందిన వెలవలపల్లి సాయిరమేష్ (28) అనే కుర్రాడు చిక్కుకున్నాడు. సాయిరమేష్‌తో వాట్సాప్ కాల్‌లో ఉష తరచూ మాట్లాడేది. ఆమె కోరిక మేరకు గతనెల 14న జామి మండలం అలమండ సంత వద్దకు వెళ్లాడు. పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న ఉష, కిరణ్‌తో పాటు ప్రసాద్, జామికి చెందిన బోని ఎర్నిబాబుతో కలిసి ఒక్కసారిగా రమేష్‌పై దాడిచేశారు. తన భార్యకు మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్‌చేసి వేధిస్తున్నాడంటూ స్థానికులను నమ్మించి బలవంతంగా బైక్‌పై రమేష్ ను భీమసింగివైపు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో బెదిరించారు. మెడలోని 18 గ్రాముల బంగారు చైన్‌ను బలవంతంగా తీసుకొని, అదనంగా మరో రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ భయపెట్టారు. యువకుడు తేరుకుని తన తప్పులేదని భావించి మార్చి 3న జామి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వై.వీర జనార్దన్ కేసునమోదు చేసి, ఫేస్‌బుక్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ సౌమ్యలత తెలిపారు. వారి నుంచి మొబైల్, పల్సర్ బైకు, బంగారం చైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలను నమ్మవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల ప్రలోభాలకు గురికావద్దని ఆమె హెచ్చరించారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, జామి ఎస్‌ఐ పాల్గొన్నారు.


