సంబరాల సంక్రాంతి పర్వదినానికి ముస్తాబైన పల్లెలు
అతిథులకు స్వాగతిమిస్తున్న గ్రామీణ ప్రాంతాలు
కొత్త అల్లుళ్లకు మైమరిపించే మర్యాదలకు ప్రత్యేక వేడుక
ప్రతి ఇంటా ప్రత్యేక వంటలు.. మూడు రోజులూ జన జాతరే..
విజయనగరం: హరిలోరంగ హరి అంటూ సమస్తం చల్లగా ఉండాలని దీవించే హరిదాసుల కీర్తనలు.. అయ్యగారికి వందనం.. అమ్మగారికి చందనమంటూ డూడూ బసవన్న దీవెనలు.. వేకువజామున జంగమదేవరలు మోగించే గంటలు.. బుడబుక్కలి వాయించే ఢమరుక నాదాలు.. బడాయి పోతూ నాకేం తక్కువంటూనే మామూళ్లడిగే పిట్టల దొరలు.. చమత్కారాలతో చిందులేస్తూ ఎంతోకొంత సమరి్పంచుకుంటే కానీ కదలని కొమ్మదాసరులు.. ఇలా చెప్పుకొంటే పోతే పెద్ద జాబితాయే పెద్ద పండుగది. ప్రతి ఏటా నిర్వహించుకునే హిందువుల అతిపెద్ద సంప్రదాయ పండగకు పట్టణాలు నుంచి సొంత ఊర్లకు తరలివస్తున్నారు బంధువులంతా.
ఆకాశమంత ఆనందం.. భూమండలమంత సంతోషం.. జతకలిస్తే ఎలాగుంటుందో సంక్రాంతి సందడి అలా ఉంటుంది. ధనుర్మాసం మొదలైన నాటి నుంచి అంటే నెలరోజుల ముందుగానే పల్లెల్లో పండగ హడావుడి ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పల్లెల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించడంతో సందడి ప్రారంభమైంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికివారే సందడిగా ఉండే పండగ సంక్రాంతి మాత్రమే. భోగిపండగ వచ్చేసింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో పండగను జరుపుకునేందుకు సర్వం సన్నద్ధమయ్యారు.
కొత్త అల్లుళ్లకు మర్యాదలే వేరు..
కొత్త అల్లుళ్లకు సంక్రాంతి కానుకగా ద్విచక్రవాహనాలు ఇవ్వడం జిల్లాలో ఆనవాయితీ. ఆ ఏర్పాట్లలో మామయ్యలు మునిగి తేలుతున్నారు. ఇదిగాకుండా ఇంటికొచ్చిన బంధుమిత్రులకు నూతన దుస్తులు పెట్టడం సంస్కృతిగా వస్తోంది. వస్త్ర దుకాణాల్లో ఇటువంటి సందడే కనిపిస్తోంది.
జనజాతర
సంక్రాంతి మూడు రోజులూ ఎక్కడ చూసినా జనజాతరలానే కనిపిస్తుంది. స్వగ్రామాలకు వచ్చిన వారంతా ఆయా వీధుల్లో తిరుగుతూ తెలిసినవారిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటుంటారు. ఎవరి ఇంటికెళ్లినా ఏదో ఒకటి తినకతప్పదు. పండగ రోజుల్లో అనాథలకు అన్నసమారాధనలు చేసే కుటుంబాలు జిల్లాలో కోకొల్లలు. వచ్చిన అతిథులకు లేకుండా అన్ని మర్యాదలు చేసే సత్సంప్రదాయం జిల్లా ప్రత్యేకత. ఇక పట్టువ్రస్తాల్లో మహిళలు, సంప్రదాయ దుస్తుల్లో యువత మెరిసిపోతుంటారు. మొత్తమ్మీద పండగంటే జిల్లాలోనే చూడాలని ఇక్కడకు తరలివచ్చే అతిథులు అనేకమంది ఉన్నారు.
పందెం రాయళ్లకు పండగే.. పండగ
సంక్రాంతి పండగ నేపథ్యంలో పందెం రాయళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. మూడురోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకుని మరీ జూదమాడేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. జూదంతో పాటు కోడి పందాలు జిల్లాలో జోరుగా సాగుతాయి. దీనికోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వివిధ జాతుల కోళ్లు బరిలోకి దిగేందుకు కాళ్లు రువ్వుతున్నాయి. అయితే, కోడి, పొట్టేళ్లు పందాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.
ప్రతి ఇంటా ప్రత్యేక వంట
సంక్రాంతికి ప్రత్యేక వంటలు పల్లెల్లో ప్రసిద్ధి. అరిసెలు, పాకుండలు, సున్నుండలు, జంతికలు, కారంబూందీ, కారపూస, బొబ్బట్లు వంటి వంటకాలు సంక్రాంతి ప్రత్యేకమైనవి. అరిసెల్లో నువ్వులు వేసి చేస్తే మరో ప్రత్యేకం. స్వచ్ఛమైన నేతితో, అచ్చమైన బెల్లంతో చేసే సున్నుండలు నోరూరిస్తాయి. భోగిరోజున భోగిమంటలో కాలి్చన వంకాయలతో చేసిన పచ్చడి, మకర సంక్రాంతి నాడు పులిహోర, గారెలు, పాయసం, కనుమకు గ్రామదేవతలకు సమరి్పంచే నైవేద్యాల్లో మాంసాహారం ఉంటుంది. ఇవిగాకుండా ఇష్టాలనుబట్టి తయారుచేసుకునే దద్దోజనం, పొంగలి వంటివి అతిథులకు ప్రత్యేక వంటకాలుగా చెప్పవచ్చు.
అన్నింటా సంక్రాంతి..
చిన్ననాటి బాల్య స్నేహితులంతా స్వగ్రామాలకు వస్తుంటారు. అంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సదావకాశం ఇచ్చేది సంక్రాంతే.కుటుంబంలో తరతరాలుగా ఉన్నవారంతా ఒకచోట చేరి కుటుంబాల పండగ నిర్వహిస్తారు.
పూర్వ విద్యార్థులంతా కూడా ఒక వేదికపైకి చేరే అపూర్వ కలయిక సంక్రాంతికే చేసుకుంటున్నారు.
పిల్లలకు ఇష్టమైన బొమ్మల కొలువు సంక్రాంతి ప్రత్యేకత. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు బొమ్మల కొలువు వద్ద చేసే సందడి అంతా ఇంతాకాదు.
సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీల వంటివి పల్లెల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి.
కొన్నిచోట్ల చూస్తే కళాకారులకు సత్కారాలు నిర్వహించి సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు కతజ్ఞతలు తెలియజేస్తారు.
ఎన్నాళ్లయ్యిందో ఆలకించి ఒక పంక్తి.. ఎన్నేళ్లయ్యిందో ఆరగించి సహపంక్తి అన్నచందాన స్నేహితులంతా కలిసి చెప్పుకొనే ముచ్చట్లు, కుటుంబ సభ్యులంతా కలిసి చేసే భోజనాలు మధురానుభూతులను మిగులుస్తాయి.
స్నేహితులతో కలిసి స్వీయచిత్రం దిగాలంటే చరవాణి తెర పట్టనంతగా ఉంటుంది సంక్రాంతి సందర్భం.
సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ వేషధారణలు చిన్నారులకు పరిచయం చేయాలి. రోజు ఆధునిక దుస్తుల్లో విసిగిపోయినవారికి ఊరటగా ఉంటుంది.


