
ఈ నెల 13న చేపల వేటలో దారి తప్పిన జాలర్లు
ఎనిమిది కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
భోగాపురం/మహారాణిపేట: విజయనగరం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్టు గార్డుల చెరలో చిక్కుకున్నారు. పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలంలోని కొండ్రాజుపాలెం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొట్టకూటి కోసం విశాఖకు వలస వెళ్లారు. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ చేపలరేవు నుంచి మరబోటు (బోటు నెంబర్ ఎంఎం75)పై సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారితప్పి బంగ్లాదేశ్ కోస్టు గార్డ్ పరిధిలోకి ప్రవేశించారు.
సిగ్నల్స్ వ్యవస్థతో గుర్తించిన అక్కడి నేవీ అధికారులు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, బోటులో జీపీఎస్ సిస్టం, ఎకో ఫైండర్ వంటి పరికరాలు చూపించారు. అయినా వారు వదిలి పెట్టలేదు. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన నక్కా రమణ, వాసుపల్లి సీతయ్య, భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, చిన్నప్పన్న ఉన్నారు.
కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న తమ వాళ్లు ప్రాంతం కాని ప్రాంతంలో బందీలుగా ఉండడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బంగ్లాదేశ్‌లో మత్స్యకారులు చిక్కుకున్నట్లు తమకు సమాచారం అందిందని జిల్లా మత్స్యకార శాఖ జేడీ లక్ష్మణరావు, డీడీ నిర్మల, ఎఫ్‌డీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ ద్వారా మత్స్యశాఖ కమిషనర్, సీఎంవోకు నివేదిక పంపామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయమై అధికారులను ఆరా తీశారు. మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, రోజులు గడుస్తున్నా తమ వారి జాడ తెలియక పోవడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.