
బాపట్ల చీలురోడ్డులో భోజనాలు చేస్తున్న మత్స్యకారులు
ఈపూరుపాలెం కాలువను పూడ్చేసిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావు
రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం కబ్జా
నిరసనగా బాపట్లలో కదం తొక్కిన 20 వేల మంది మత్స్యకారులు
కాలువను పునరుద్ధరించాలని డిమాండ్
గుంటూరు, రేపల్లె, బాపట్ల వెళ్లే రహదారుల దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి పూడ్చివేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్‌కట్ కాలువను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చీరాల, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని 12 వేల కుటుంబాలకు చెందిన సుమారు 20 వేలమంది మత్స్యకారులు బుధవారం బాపట్లలో కదం తొక్కారు. వివిధ రూపాల్లో ఆందోళన తెలియజేసారు. ఎల్.ఆకారంలో ఉన్న స్ట్రెయిట్ కట్‌ను సీమౌత్ వద్ద పూడ్చి వేయడం వల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది.
పోటు సమయంలో సముద్రపు నీరు వేగంగా కాలువలోకి వచ్చి అక్కడ ఉండే 2 వేల బోట్లలో చాలావరకు దెబ్బతింటున్నాయి. దీనివల్ల పేద మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై గతంలో ఆందోళన చేసిన సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట మురళి హామీ ఇచ్చినా.. అది నెరవేరలేదని, తక్షణం ఆక్రమణలు తొలగించి కాలువను పునరుద్ధరించాలని వేలాది మంది గంగపుత్రులు ఉదయం 10 గంటలకు బాపట్లకు చేరుకున్నారు.

తొలుత గడియార స్తంభం సెంటర్‌లో గంటపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని బైఠాయించారు. గంటన్నరపాటు అక్కడే నిరసన తెలిపారు. ఆ తర్వాత ర్యాలీగా చీలు రోడ్డుకు చేరుకున్న మత్స్యకారులు అక్కడ గుంటూరు, మచిలీపట్నం, చీరాల రోడ్లను దిగ్బంధించారు. రోడ్డుపై కూర్చుని టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించిన ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్‌ను తక్షణం పునరుద్ధరించాలని, వేలాది మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని నినదించారు.
పర్యావరణ శాఖ మంత్రి స్పందించాలి
పర్యావరణ శాఖామంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని, సీమౌత్‌ను వెంటనే తెరిపించాలని మత్స్యకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. పూర్వం నుంచి వున్న కాలువను ఆక్రమించిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావుపై కేసులు నమోదు చేయాలని, తీరంలో ఆయన పొందిన డీకేటీ పట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు.
మత్స్యకారుల ఆందోళనతో బాపట్లలో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలవరకూ ఆందోళన విరమించకపోవడంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ రాంబాబు వచ్చి ఆందోళన విరమించాలని పదేపదే కోరినా మత్స్యకారులు ససేమిరా అన్నారు. 2:30 గంటల సమయంలో బాపట్ల ఆర్డీవో గ్లోరియా వచ్చి ఆందోళన విరమించాలని మత్స్యకారులను కోరినా అంగీకరించలేదు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. కలెక్టర్ వద్దకు వచ్చి సమస్యను విన్నవించాలని ఆర్డీవో, డీఎస్పీలు కోరినా.. కలెక్టర్ ఇక్కడేకే రావాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు.
పండుగ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చర్చించాలని ఆర్డీవో, డీఎస్పీలు చెప్పినా మత్స్యకారులు వినిపించుకోలేదు. డీఎస్పీ రామాంజనేయులు పదేపదే చెప్పడంతో సాయంత్రం 6 గంటలకు ఆందోళనకారులంతా కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిశారు. తాను కొత్తగా వచ్చానని, రెండు రోజుల క్రితమే ఈ సమస్య దృష్టికి వచ్చిందని చెప్పిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో సంతృప్తి చెందని మత్స్యకారులు ఎమ్మెల్యే నరేంద్రవర్మ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆందోళన కొనసాగిస్తామని.. గురువారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మత్స్యకారులు చెప్పిన మత్స్యకారులు అక్కడినుంచి వెనుదిరిగారు. నిరసన కార్యక్రమాలకు మత్స్యకార సంఘ నాయకులు బాబ్జి, రమణ, సూరిబాబు, సైకం రాజశేఖర్, శీలం రవికుమార్, తదితరులు నాయకత్వం వహించారు.