
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును విరమించుకోవాలంటూ ఆందోళన
మరో కరేడుగా మారిన రాజయ్యపేట
జాతీయ రహదారి దిగ్బంధం
4 గంటల పాటు ధర్నా
20 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మరో కరేడుగా మారింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలంటూ ఆదివారం వేలాది మంది మత్స్యకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. సుమారు 4 గంటల పాటు కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మత్స్యకారుల ఆందోళనతో సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే... నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో 2,200 ఎకరాల్లో ప్రభుత్వం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పార్క్ ఏర్పాటైతే ఇక్కడ వందలాది ప్రమాదకర రసాయన పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేస్తారని, ఫలితంగా ఈ ప్రాంతమంతా కాలుష్యమయం అవుతుందని మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ రాజయ్యపేట మత్స్యకారులు 29 రోజులుగా గ్రామంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఈ ఆందోళనకు పోలీసులు అనేక అడ్డంకులు కల్పిస్తున్నారంటూ మత్స్యకారులు ఆవేదనతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో 15 రోజుల క్రితం పనుల్ని అడ్డుకున్నారు. హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టడంతో గత నెల 30న హోంమంత్రి అనిత గ్రామంలోకి వచ్చారు. మంత్రిని కూడా అడ్డుకుని ఘెరావ్ చేశారు. మత్స్యకారుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని, పనులు తాత్కాలికంగా నిలిపివేయిస్తానని హామీ ఇచ్చి, అక్కడినుంచి ఆమె వచ్చేశారు.
గ్రామం నుంచి 30 మంది కమిటీగా వస్తే సీఎం దగ్గరకు తీసుకెళ్తానని ప్రకటించారు. ఇది జరిగి 15 రోజులు గడుస్తున్నా హోంమంత్రి నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి స్పందన లేదు. మత్స్యకారులు గ్రామంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ రాజకీయ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానికేతరులను గ్రామంలోకి రానివ్వడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల వైఖరితో విసిగివేసారి..
ఆదివారం దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణను ఉపమాకలో అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రగిలిపోయిన మత్స్యకారులు ఆదివారం మధ్యాహ్నం నిరాహార దీక్ష శిబిరం నుంచి 6 కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లి నక్కపల్లి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మార్గంమధ్యలో పోలీసులు మత్స్యకారులను ట్రాక్టర్లు, ఐరన్ స్టాపర్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నప్పటికీ వాటిని «తొలగించుకుంటూ వందలాది మంది మహిళలు, మత్స్యకారులు జాతీయ రహదారిపై ఉపమాక జంక్షన్ వద్ద ధర్నాకు దిగారు.
డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళన
తక్షణమే బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన మత్స్యకారులు డిమాండ్ చేశారు. మత్స్యకారులు, నాయకులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని, రాజయ్యపేటలో అమల్లో ఉన్న 144వ సెక్షన్ ఎత్తివేయాలని, మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ పార్టీల నాయకులను అడ్డుకోవడానికి వీల్లేదని, ర్యాలీ సందర్భంగా మహిళలపై దౌర్జన్యం చేసి గాయపర్చిన ఎస్.రాయవరం సీఐ లొడ్డు రామకృçష్ణను, నక్కపల్లి ఎస్‌ఐ సన్నిబాబును సస్పెండ్ చేయాలని పోలీసులు అడ్డుకున్న వీసం రామకృష్ణను తక్షణమే ఆందోళన వద్దకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు.
హోంమంత్రి అనిత తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వందలాది మంది బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నర్సీపట్నం ఆర్‌డీవో వీవీ రమణ, డీఎస్పీ శ్రీనివాసరావు వచ్చి మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారెవరూ పట్టించుకోలేదు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని, అంతవరకు ధర్నా విరమించే ప్రసక్తి లేదంటూ నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు.
సుమారు 4గంటల పాటు జాతీయ రహదారిపైనే ధర్నా చేయడంతో రెండువైపులా సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిíచిపోయాయి. ఎట్టకేలకు సాయంత్రం 5.30 గంటలకు కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. బుధవారం రాజయ్యపేటలో మత్స్యకారులందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు.