
విశాఖ: నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గురువారు(అక్టోబర్ 9వ తేదీ) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కేజీహెచ్‌లోని పచ్చకామెర్ల బాధిత విద్యార్థులను వైఎస్ పరామర్శించారు. పచ్చకామెర్ల బారిన పడ్డ బాధిత విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. మీడియాను కేజీహెచ్ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించడంతో బయట మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్.


‘170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వచ్చాయి. పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. స్కూళ్లు, హాస్టల్స్‌లో బాత్రూమ్‌లను శానిటేషన్ చేయాలి. ఒకే స్కూల్ నుంచి 65 మంది విద్యార్థులు కేజీహెచ్‌లో చేరారు. కురుపాం నుంచి 200 కి.మీ దూరంలో కేజీహెచ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలుషిత నీటి వల్లే పిల్లలకు ఈ పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 170 మంది పిల్లలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా వాటర్ ప్లాంట్‌ను రిపేర్ చేయించాలి. పిల్లల తరఫున మేం మెడికో లీగల్ కేసు వేస్తాం. వైఎస్సార్‌సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందజేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’