
వెంకటాపురం మాజీ సర్పంచ్
కుటుంబం ఘాతుకం
తమ కుమార్తెను ప్రేమించాడని దారుణం
విశాఖపట్నం: పొరుగు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో దేవరాపల్లి మండలం కాశీపాలెం గ్రామానికి చెందిన డెక్క నవీన్ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ధ్రువీకరించనప్పటికీ ఈ దుర్ఘటన జరిగినట్టు శుక్రవారం రాత్రి విస్తృతంగా ప్రచారమైంది. నవీన్ రాంబిల్లి మండలం చిన్నపూడి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.
రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమార్తెతో పదో తరగతి, ఇంటర్ నుంచి అతడికి స్నేహం ఏర్పడింది. వీరి సాన్నిహిత్యం గురించి తెలిసి యువతిని చెన్నైలో చదివిస్తున్నారని, అయినా వీరి మధ్య పరిచయం కొనసాగిందని, అదే అమ్మాయి తరపు వారికి కంటగింపుగా మారిందని సమాచారం. నవీన్ వేరే కులానికి చెందినవాడు కావడం, పెద్దగా చదువుకోకపోవడం, ఆస్తి లేకపోవడంతో అమ్మాయి తల్లికి ఇష్టం లేదు.
మూడు రోజుల క్రితమే అమ్మాయిని తీసుకొని తల్లి అరుణాచలం వెళ్లింది. నవీన్‌కి ఫోన్ చేసి వారు ఉన్న చోటుకు రప్పించారు. అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని ఉన్నారు. నవీన్ ఫోన్‌లో అసభ్యకరమైన ఫొటోలు ఉన్నట్లు గమనించి లాక్కొని చితకొట్టేశారు. అనంతరం తమతో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో నవీన్‌ను హత్య చేసినట్లు సమాచారం. అమ్మాయిని, ఆమె తల్లిని అరుణాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ప్రస్తుతం ఇద్దరూ అక్కడ జైల్లో ఉన్నట్లు భోగట్టా.