
అనకాపల్లి: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ధర్నా చేపట్టిన మత్స్యకారులతో కలెక్టర్ సంప్రదింపులు జరిపారు. తనకు కాస్త టైమ్ ఇవ్వాలని మత్స్యకారులను కలెక్టర్ విజయ్ కృష్ణన్ కోరారు. బుధవారం వరకూ తనకు సమయం ఇవ్వాలన్నారు కలెక్టర్.
కలెక్టర్ విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా హైవేపై ధర్నాను విరమించారు మత్స్యకారులు. బుధవారం తర్వాత సమస్యకు పరిష్కారం రాకపోతే మరొకసారి ఆందోళన బాట పడతామని మత్స్యకారులు హెచ్చరించారు.
అనాకపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికే 25 రోజులు కొనసాగుతోంది.
మత్స్యకారుల ఆందోళనకు ప్రధాన కారణాలు:
పర్యావరణ హానికి భయం: ఇప్పటికే ఉన్న మందుల పరిశ్రమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే, సముద్ర జీవనానికి హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రసాయన పరిశ్రమల వల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోతుందని, తమ జీవనాధారం ప్రమాదంలో పడుతుందని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే నిరాహార దీక్ష కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.