కదంతొక్కిన కడలి పుత్రులు | Concern over TDP leader Burla Venkatarao occupation | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన కడలి పుత్రులు

Jun 25 2025 5:30 AM | Updated on Jun 25 2025 5:30 AM

Concern over TDP leader Burla Venkatarao occupation

టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమణలపై ఆందోళన 

బాపట్ల పాత బస్టాండు, కలెక్టరేట్‌ వద్ద ధర్నా 

చీలు రోడ్డు వద్ద మానవహారం

 

సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ సీ మౌత్‌ను తక్షణం పురుద్ధరించి వెంకట్రావుతోపాటు భాగస్వామిగా ఉన్న గుంటూరు భ్రమర ఇన్‌ఫ్రాకు చెందిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ మత్స్యకారులు మంగళవారం బాపట్లలో పెద్దఎత్తున ఆందో­ళన చేశారు. తీరగ్రామాలకు చెందిన మత్స్యకారులు బాపట్ల చేరుకుని ర్యాలీ చేపట్టారు. పాతబస్టాండు వద్ద ధర్నా నిర్వహించి.. ఆ తర్వాత చీలురోడ్డులో మానవహారం చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్తుండగా.. పోలీ­సు­లు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. 

కలెక్టర్‌తో చ­ర్చలు జరిపేందుకు వస్తున్నామని ఆందోళనకారులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తర్వాత 20 మందిని మాత్రమే కలెక్టర్‌ కార్యాలయానికి అనుమతిస్తామని చెప్పడంతో అందరినీ అనుమతించాల్సిందేనంటూ అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. కలెక్టర్‌తో చర్చించేందుకు 25 మందికి అనుమతి లభించడంతో పోలీసులు మత్స్యకార నాయకులతోపాటు ప్రజాసంఘాల వారిని పోలీ­సులు లోపలికి అనుమతించారు. 2 గంటలపాటు మత్స్యకారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో చర్చించిన కలెక్టర్‌ వెంకట­మురళి ఈపూరుపాలెం సీమౌత్‌కు అడ్డుగా వేసిన రాళ్లను తొలగించి మత్స్యకారులు తక్షణం వేటకు వెళ్లేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. 

తర్వాత జిల్లా అధికారులతో కమిటీ వేసి నెల రోజుల్లో తీరంలో సీఆర్‌జెడ్‌ నిబ­ంధనలకు అనుగుణంగా ప్రభుత్వ, అసైన్డ్‌ భూ­ము­­ల వివరాలను తేల్చి భూ ఆక్రమణకు పాల్ప­డిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పా­రు. గతంలో కాలువ పూడికతీత పేరుతో 500 లారీల ఇసుకను అక్రమంగా తీసుకెళ్లిన వారిపైనా క్రిమి­నల్‌ కేసులు పెడతామన్నారు. ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులపై పెట్టిన కేసులను సైతం తొలగిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.  దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement