
హాజరైన సచివాలయ ఉద్యోగులు
నెల్లూరు (పొగతోట): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు టౌన్‌హాల్‌లో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆత్మగౌరవ రొట్టె, ఆత్మగౌరవ సమావేశం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర కార్యక్రమాలకు పోలీసుల అనుమతి కోరారు. ఆత్మగౌరవ రొట్టె, కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించకపోవడంతో ఆత్మగౌరవ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు టౌన్‌హాల్‌కు భారీగా తరలివచ్చారు. అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు సభ నిర్వహణకు అనుమతిలేదంటూ ఉద్యోగులను బయటకు పంపించేశారు. అనంతరం టౌన్‌హాల్ గేట్లకు తాళాలు వేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేఏసీ నాయకులు, ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వీఆర్సీ మైదానం వద్దకు వెళ్లాలంటూ హుకుం జారీ చేయడంతో అక్కడికి చేరుకుని నిరసన కొనసాగించారు.
మా డిమాండ్లు నెరవేర్చాలి
ఉభయ గోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది. 1,500 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.
ఐక్యవేదిక చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్‌తో క్యాడర్ అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. సంఘ సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్‌కృష్ణ, కనీ్వనర్ షేక్ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు.