
జై పైడిమాంబ... జై జై పైడిమాంబ... అంటూ లక్షలాది భక్తజనం జయజయధ్వానాల నడుమ సిరులతల్లి... విజయనగర ప్రజల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 4.24 గంటలకు ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంలో దర్శనమిచ్చారు.
అనంతరం మూడుసార్లు అమ్మవారి చదురుగుడి నుంచి కోట వరకు సాగిన ఉత్సవం సాయంత్రం 5.47 గంటలకు ముగిసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కోట బురుజుపై నుంచి, విజయనగరం అర్బన్ బ్యాంక్ భవనం ఉన్న ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వేదిక నుంచి రాష్ట్ర శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ వీక్షించారు.
అయితే, ఏర్పాట్లలో డొల్లతనం కారణంగా ఈ వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపై కూర్చున్న బొత్స సత్యనారాయణతోపాటు ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, ఒక ఎస్‌ఐ, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.
– సాక్షిప్రతినిధి, విజయనగరం