సాక్షి,ఢిల్లీ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. పేద ప్రజలను వైద్య విద్యకు దూరం చేసేందుకు చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గళం విప్పుతాం’అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్లు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు.
‘అమరావతికి మేము వ్యతిరేకం కాదు.అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడాలని బిల్లులో పెడితే మద్దతు ఇస్తాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గళం విప్పుతాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు మూలన పడేశారు. దానికి నిధులు కేటాయించకుండా రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారిపోయింది.నిర్దేశించిన సీలింగ్‌కు మించి 69 శాతం ఎక్కువగా అప్పులు చేశారు.అప్పుల తెచ్చిన నిధులను ఏం చేస్తున్నారు.
కనీసం సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడం లేదు. 8 త్రైమాసిక ఫీజులు చెల్లించలేదు. కనీసం హాస్టల్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉంటున్నారు. రైతులకు పంటల భీమా అమలు చేయడం లేదు.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి తగ్గించిన నిధులను కేంద్ర నుంచి తీసుకురావాలి.కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ... నిధుల లోటును పూడ్చేలా కృషి చేయాలి’ అని డిమాండ్ చేశారు.


