పెళ్లంటూ ఎర... గిఫ్టంటూ టోకరా! 

Young Woman Was Cheated By Cyber Criminals At Hyderabad - Sakshi

రూ.10.69 లక్షలు కాజేసిన నైజీరియన్లు 

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ యువతిని సైబర్‌ నేరగాళ్లు నిండా ముంచారు. మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయమైన నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆపై బహుమతి పంపిస్తున్నానంటూ చెప్పి కస్టమ్స్‌ అధికారులుగా ఫోన్లు చేసి రూ.10.69 లక్షలు కాజేశాడు. బాధితురాలు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 
సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి (25) మేకప్‌ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఈమెకు కొన్ని నెలల క్రితం భారత్‌మాట్రిమోనీ సైట్‌ ద్వారా రాజీవ్‌ మలిన్‌ అని చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. 
తాను లండన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుడినని, అక్కడి వీట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల పాటు వీరి మధ్య చాటింగ్‌ నడిచింది. 
ఈ యువతితో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చిన రాజీవ్‌... బెంగళూరులో స్థిరపడదామని ఆశపెట్టాడు. తాను త్వరలో కెనడా వెళ్తున్నానని, అట్నుంచి ఇండియా వచ్చి నీతో పాటు కుటుంబసభ్యులను కలుస్తానన్నాడు.    (ప్రేమ పేరుతో మాయమాటలు.. పలుమార్లు అత్యాచారం)
​​​​​​​

ఇదంతా ఈ ఏడాది మార్చి మొదటి వారంలో జరిగింది. ఓ రోజు నీకో గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ రాజీవ్‌ నుంచి నగర యువతికి సందేశం అందింది. లండన్‌ నుంచే దాన్ని పార్శిల్‌ చేసినట్లు అందులో ఉంది.  
ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారుల పేరుతో యువతికి ఫోన్‌ వచ్చింది. దానిని క్లియర్‌ చెయ్యాలంటే వివిధ రకాలైన పన్నులు కట్టాల్సి ఉందంటూ చెప్పారు. దీనికి యువతి అంగీకరించడంతో తొలుత కేవలం రూ.27 వేలు చెల్లించమన్నారు. ఆ మొత్తాన్ని బాధితురాలు ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. 
ఈ ఏడాది మార్చి 9న ఈ చెల్లింపు జరగ్గా... కేవలం నాలుగు రోజుల్లో 12 లావాదేవీలు ఈమెతో చేయించారు. ఇలా పన్నుల పేరుతో రూ.10.69 లక్షలు కాజేశారు. మోసపోయాననే విషయం తెలుసుకున్న యువతి  శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.  ఇది నైజీరీయన్ల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top