సరదాగా కలుద్దామన్నాడు..  స్టార్‌ హోటల్లో కాటేశాడు

Woman Raped On Pretext Of Marriage In Hyderabad - Sakshi

ఢిల్లీ మహిళపై హైదరాబాదీ అత్యాచారం

ఫార్మా వ్యాపారం చేస్తున్న నిందితుడు మొహక్‌ గుప్తా

సోషల్‌మీడియాలో పరిచయమైన మహిళకు వల

కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు కలిపి అఘాయిత్యం

ద్వారక పోలీసుస్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు

బంజారాహిల్స్‌ నివాసం నుంచి తృటిలో తప్పించుకున్న గుప్తా

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో పరిచయమైన మహిళపై కన్నేశాడు. సరదాగా కలుద్దామన్నాడు. నమ్మకం కలిగేలా ప్రవర్తించాడు. స్టార్‌ హోటల్‌కు తీసుకెళ్లాడు. కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా వ్యాపారి ఢిల్లీలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్కడి ద్వారక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎస్సై కునాల్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి తృటిలో తప్పించుకున్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తోంది.

టిండర్‌ యాప్‌ ద్వారా పరిచయం
నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన మొహక్‌ గుప్తాకు ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌తో పాటు ఢిల్లీలో కంపెనీ, కార్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీలోని ద్వారక సెక్టార్‌ 23లో ఓ ఇల్లు కూడా ఉంది. ఈయనకు టిండర్‌ యాప్‌ ద్వారా అక్కడి గురుద్వార సింగ్‌ సభ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పరిచయమైంది. ఈ వివాహిత 2017 నుంచి తన భర్తకు దూరంగా పిల్లలతో కలిసి ఉంటోంది.

గత నెల్లో ఢిల్లీలో ఉన్న గుప్తా 27న ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆ రోజు రాత్రి సరదాగా కలుద్దామని చెప్పాడు. దీంతో సదరు వివాహిత తన సోదరితో వచ్చి ఓ కెఫేలో అతన్ని కలిసింది. డిన్నర్‌ చేస్తున్న సమయంలో మొహక్‌ ఆమె వద్ద ప్రేమ ప్రతిపాదన చేశాడు. అయితే ఆమె జవాబు దాటవేసింది.

తొలుత మర్యాదగా ప్రవర్తించి..
మరుసటి రోజు మరోసారి ఫోన్‌ చేసి కలవాలని ఉందంటూ చెప్పాడు. దీంతో ఆమె మెట్రో రైల్‌లో ద్వారక స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ తన బీఎండబ్ల్యూ కారుతో వేచి ఉన్న మొహక్‌ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక కారు ఆపి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఆమెకు నమ్మకం కలిగించేందుకు గుప్తా చాలా మర్యాదగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో గత నెల 30న ఆమెపై అఘాయిత్యానికి పథకం వేశాడు. ఫోన్‌ చేసి రప్పించాడు. ప్రేమ, పెళ్లి విషయాలు మాట్లాడుకుందామంటూ సమీపంలోని ఓ స్టార్‌ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఎలాంటి అంతరాయాలు లేకుండా మాట్లాడుకుందామని చెప్పి రూమ్‌ బుక్‌ చేశాడు. 

మత్తులో ఉండగా ...
హోటల్‌ గదిలోకి వెళ్లిన తర్వాత కూడా కొద్దిసేపు నమ్మకంగా ప్రవర్తించిన మొహక్‌.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. మత్తులో ఉన్న మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు హోటల్‌ నుంచి వెళ్తూ పెళ్లి చేసుకుంటానని హామీ  ఇచ్చి హైదరాబాద్‌ వచ్చేశాడు. తర్వాత ఆమె ఎంత ప్రయత్నించినా ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడం, ఒకవేళ ఫోన్‌ కలిసినా సరైన స్పందన లేకపోవడంతో.. తనపై అఘాయిత్యం చేయడానికే మొహక్‌ పథకం వేశాడని గ్రహించి గత శుక్రవారం ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గుప్తాపై అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు.

వెనుక గోడ దూకి పరారీ
మొహక్‌ స్టార్‌ హోటల్‌లో ఇచ్చిన గుర్తింపు కార్డులతో పాటు ఫోన్‌ నంబర్‌ ఆధారంగా అతను హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం సాయంత్రం అతని ఇంటిపై దాడి చేశారు. అయితే విషయం గమనించిన గుప్తా ఇంటి వెనుక గోడ దూకి పరారయ్యాడు. దీంతో నగరంలోనే బస చేసిన ఢిల్లీ పోలీసు బృందం మొహక్‌ కోసం గాలిస్తోంది. ఇంటితో పాటు సోమాజిగూడలో ఉన్న మొహక్‌ ఆఫీసు, మరికొన్ని ప్రాంతాల్లోనూ నిఘా వేసి ఉంచింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top