Extra Maritual Affair: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు..

Woman Assassinated Husband With Support Of Lover In Nalgonda - Sakshi

యువకుడి దారుణ హత్య

మాల్‌ వెంకటేశ్వరనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి..

భార్య, ఆమె ప్రియుడే సూత్రధారులు

మరో ఇద్దరి సహకారంతో ఘాతుకం

పోలీసుల అదుపులో హతుడి భార్య, పరారీలో ముగ్గురు నిందితులు

సాక్షి, నల్గొండ: సఖ్యతకు అడ్డొస్తున్నాడనే నెపంతో ఆ ఇల్లాలు ప్రియుడితో కలిసి మరో ఇద్దరి సహకారంతో భర్తనే కడతేర్పించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌ వెంకటేశ్వరనగర్‌లో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. నాంపల్లి సీఐ సత్యం తెలిపిన ప్రకారం.. చింతపల్లి మండలం బాలాజితండాకు చెందిన గణేశ్‌(28), పార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

నెల రోజుల క్రితం..
గణేశ్‌ భార్య పార్వతి అదే తండాకు చెందిన మంగ్తాతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతోంది. అయితే, ఈ విషయం నెల రోజుల క్రితం గణేశ్‌కు తెలియడంతో మంగ్తా కుటుంబంతో గణేశ్‌ కుటుంబ సభ్యులకు మధ్య  గొడవలు జరిగాయి. కాగా, భార్య ప్రవర్తనకు విసుకుచెందిన గణేశ్‌ తండాను వదిలి కుటుంబంతో సహా హైదరాబాద్‌ బాట పట్టాడు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 
చదవండి: అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్నా’

ప్రణాళికతో పిలిపించి..
గణేశ్‌ కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లినప్పటి నుంచి మంగ్తా, పార్వతి కలవడానికి వీలులేకుండా పోయింది. దీంతో తమ సఖ్యతకు అడ్డుగా ఉన్న గణేశ్‌ను మట్టుబెట్టాలని అతడి భార్య పార్వతి, ప్రియుడు మంగ్తా నిర్ణయించుకున్నారు. అందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా గణేశ్‌ స్నేహితులైన బాలాజితండాకు చెందిన రమావత్‌ సంతోష్, రమావత్‌ గణేశ్‌లను మంగ్తా ఆశ్రయించాడు. వీరిద్దరితో గత ఆదివారం గణేశ్‌కు ఫోన్‌ చేయించి మాల్‌ వెంకటేశ్వర్‌ నగర్‌కు పిలిపించాడు. అప్పటికే రమావత్‌ సంతోష్, రమావత్‌ గణేశ్, మంగ్తా అక్కడికి చేరుకున్నారు. తొలుత  రమావత్‌ గణేశ్, రమావత్‌ సంతోష్‌ ఇద్దరూ గణేశ్‌( పార్వతి భర్త)ను కలుసుకుని మద్యం తాగారు. 
చదవండి: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్‌

గుట్టపైకి తీసుకెళ్లి..
మరికొంత మద్యం తాగేందుకు ఆదివారం సాయంత్రం మాల్‌ వెంకటేశ్వరస్వామి గుట్టపైకి గణేశ్‌ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో వీరితో మంగ్తా కూడా కలిసాడు. అందరూ కలిసి గుట్టపైన నిర్మానుష్య ప్రదేశంలో పూటుగా మద్యం తాగిన గణేశ్‌ను కత్తితో పొడిచి దారుణంగా మట్టుబెట్టారు. అనంతరం ముగ్గురు నిందితులు అక్కడినుంచి పారిపోయారు. 

కుళ్లిపోయిన మృతదేహం
నాలుగు రోజుల క్రితం హత్య గావింపబడిన గణేశ్‌ మృతదేహం కుళ్లిపోయే దశకు చేరుకుంది. ఆదిభట్ల పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నాంపల్లి సీఐ సత్యం, చింతపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బందితో కలిసి మాల్‌ వేంకటేశ్వస్వామి గుట్టను సందర్శించారు. అక్కడ కుళ్లిపోయిన గణేశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతుడి భార్య పార్వతిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. గణేశ్‌ తండ్రి  రమావత్‌ ధంసింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

భర్త కనిపించడం లేదని..
హైదరాబాద్‌లోనే ఉన్న పార్వతి ఆదివారం నుంచి తన భర్త కనిపించడం లేదని అక్కడి ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు పార్వతి కదలికలపై నిఘాపెట్టారు. రెండు రోజుల పాటు గణేశ్‌ గురించి విచారణ సాగించినా కేసు ముందుకు సాగలేదు. దీంతో పార్వతిని అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్యోదంతం వెలుగుచూసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top