‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. షబ్బీర్‌ జ్ఞాపకాలు ప్రతీ క్షణం వెంటాడుతున్నాయ్‌’

Unemployed Shabbir Wife Commits Suicide At Ellanthakunta Huzurabad - Sakshi

జమ్మికుంట(హుజూరాబాద్‌): నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగు నెలల కిందట భర్త ఆత్మహత్య చేసుకుంటే.. నేడు అతని జ్ఞాపకాలు మరువలేక భార్య ఉరేసుకుంది. నిరుద్యోగి షబ్బీర్‌ కుటుంబాన్ని విధి వెక్కిరించడాన్ని తల్చుకుంటూ జమ్మికుంట వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సీఐ రాంచందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్, జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన రేష్మ(26) 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లారు. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన షబ్బీర్‌ అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు.
చదవండి: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్‌

కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి, భార్యతో కలిసి జమ్మికుంట వచ్చాడు. స్థానిక హౌజింగ్‌బోర్డు కాలనీలో గది అద్దెకు తీసుకున్నారు. కానీ ఇక్కడా అతనికి పని దొరకలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే సన్నద్ధం అవుదామనుకుంటే రాలేదు. ప్రైవేటు ఉద్యోగాలకు ప్రయత్నించినా దొరకలేదు. గది అద్దె చెల్లించేందుకు, భార్యను పోషించుకునేందుకు డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సూసైడ్‌ నోట్‌ రాసి, ఈ ఏడాది ఆగస్టు 1న జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి, ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందినప్పటి నుంచీ రేష్మ అంబేద్కర్‌ కాలనీలోని తల్లిగారింట్లో ఉంటోంది.
చదవండి: ప్రముఖ సింగర్‌ హరిణి కుటుంబం అదృశ్యం, ఏకే రావు మృతదేహం లభ్యం

ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సీఐ రాంచందర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ సూసైడ్‌ నోట్‌ లభించింది. ‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్న.. షబ్బీర్‌ జ్ఞాపకాలు ప్రతీ క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఇలా క్షణక్షణం చస్తూ బతకడం నా వల్ల కావట్లేదమ్మా.. అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను.. చింటు, పప్పుగా అమ్మను, నాన్నను జాగ్రత్తగా చూసుకోండి.. నన్ను క్షమించండి’ అని అందులో రాసిందని సీఐ పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు గోపీచంద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top