
కూతురు చనిపోయిన మూడు రోజులకే తండ్రి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా రంగంపేటలో విషాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా: ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధిస్తున్నారని మనస్తాపానికి గురైన బాలిక మూడు రోజుల క్రితం మరణించగా.. బిడ్డా నీ వెంట నేనంటూ తండ్రి ఉరివేసుకొని గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామానికి చెందిన బాలిక తనను ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారని లేఖరాసి, మనస్తాపానికి గురై సోమవారం చనిపోయింది. పోస్ట్‌మార్టం అనంతరం మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని స్వగ్రామంలో ఖననం చేశారు.
ఒంటరిగా ఉంటున్న మృతురాలి తండ్రి తిరుపతి (42) అదేరోజు సాయంత్రం తన సొదరితో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేటకు వెళ్లాడు. కూతురు చనిపోయిందన్న మనస్తాపంతో గురువారం ఉదయం ఇంట్లో లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షాలు తీవ్రంగా ఉండడంతో మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావడానికి ఇబ్బందికరంగా ఉందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి భార్య తన కొడుకుతో పాటు వేరుగా బెజ్జంకి మండలం చీలాపురంలో ఉంటోంది. కాగా.. తీపిరిశెట్టి తిరుపతి, మధుశాలిని నివసిస్తున్న రంగంపేటలోని ఇంటిని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ మొగిలి, ఇల్లంతకుంట ఎస్సై అశోక్ పరిశీలించారు.