ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్‌ ట్విస్ట్‌

Wife Protest In Front Of Husband House In Nallajerla East Godavari - Sakshi

నల్లజర్ల(తూర్పుగోదావరి): కాపురానికి తీసుకెళ్లాలని ఓ మహిళ తన భర్త ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. పెద్దల సమక్షంలో ఈ నెల 19 వరకు భర్త తండ్రి గడువు కోరడంతో తన నిరసనను విరమించింది. వివరాలిలా ఉన్నాయి. నల్లజర్ల మండలం చీపురుగూడెంకు చెందిన వసంతాడ అనిల్‌కుమార్, అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన తమ్మిలేటి నాగరాణి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలసి చదువుకున్నారు. నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. చదువు పూర్తయ్యాక సికింద్రాబాద్‌ ఆర్య సమాజంలో గతేడాది డిసెంబర్‌ 17న వివాహం చేసుకున్నారు. ఐదునెలలు మియాపూర్‌లో కాపురం చేశారు.

అతనికి చెన్నైలో ఉద్యోగం వచ్చింది. దీంతో అతను చైన్నైకు మకాం మార్చాడు. ఆరుమాసాలుగా మొహం చాటేస్తూ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అప్పట్లో నాగరాణి హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్వరలో వచ్చి నాగరాణిని తీసుకెళతానని అనిల్‌ లిఖిత పూర్వక హామీ ఇచ్చాడు. అయినా తీసుకెళ్లలేదు. దీంతో గత నెల 10వ తేదీన అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో నాగరాణి ఫిర్యాదు చేసింది.

కొంతగడువు కావాలని కోరడంతో పోలీసులు నచ్చజెప్పారు. అయినా అనిల్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మహిళా సంఘ నాయకులతో నాగరాణి గురువారం సాయంత్రం చీపురుగూడెంలో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. గ్రామసర్పంచ్‌ గాలింకి రాంబాబు, పెద్దలు జాలిది రవి, కొరపాటి గంగరాజుల సమక్షంలో ఇరువర్గాలతో మాట్లాడారు. ప్రస్తుతం అనిల్‌కుమార్‌ చెన్నైలో ఉన్న దృష్ట్యా అతనిని స్వగ్రామానికి రప్పిస్తామని ఈ నెల 19 వరకు గడువు కావాలని తండ్రి వసంతాడ వెంకటేశ్వరావు కోరడంతో పెద్దలు

నాగరాణికి లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. ఆమె తరఫున రాష్ట్ర గిరిజన మహిళా సంఘ నాయకురాలు మడకం లక్ష్మి, బి.రమాదేవి, బి.సరస్వతి, దాసరి రేవతితో పాటు పోలవరం నియోజకవర్గం నుంచి మరో 20 మంది మహిళా నాయకులు పాల్గొన్నారు.
చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే?   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top