ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర

Vijayawada Divya Assassination Case Police Recorded Nagendra Statement - Sakshi

సాక్షి, విజయవాడ: ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామని నాగేంద్ర తెలిపాడు. నాగేంద్ర ఇచ్చి వాంగ్మూలం ప్రకారం.. ‘మూడేళ్ల క్రితం దివ్య నాకు పరిచయమైంది. మా ఇద్దరికీ వివాహమైంది. దివ్య బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకున్నా. ఏడు నెలలుగా ఆమె నాకు దూరంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లా. తమ పెద్దలు అంగీకరించడంలేదని చనిపోదామని దివ్య చెప్పింది. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నా చేతిని ఎవరు కోశారో అర్థం కాలేదు’అని నాగేంద్ర పేర్కొన్నాడు.
(చదవండి: మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర)

కాగా, నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనంగా మారింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకున్న తనను దివ్య దూరం పెట్టిందని నాగేంద్ర చెప్తుండగా.. అవన్నీ అబద్ధాలని దివ్య తల్లిదండ్రులు తోసిపుచ్చారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే నాగేంద్ర ప్రేమ, పెళ్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కూతురు ఏనాడూ ప్రేమకు సంబంధించిన విషయం చెప్పలేదని అన్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక దివ్యపై దాడి అనంతరం తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్న నాగేంద్ర తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో దివ్య తేజశ్విని ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. నాగేంద్ర పెయింటర్‌.
(చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం)

ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దివ్య తేజస్విని అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ వ్యవహారంపై  దివ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. దివ్యతో నాగేంద్రకు రహస్య వివాహం జరిగిందన్న నిందితుడి వాదనలో నిజం లేదు. నాగేంద్ర ఇంటిపై మేము దాడి చేసామన్న ఆరోపణలు కూడా  సత్యదూరం. అతడి మాటల్లో దివ్యపై ప్రేమ ఉంటే అంత కిరాతకంగా ఎలా చంపాడు..?. వాట్సాప్‌ చాటింగ్‌లు, ఫొటోలు విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవన్నీ కూడా మార్ఫింగ్‌ ఫొటోలని దివ్య తల్లి కుసుమ కొట్టిపారేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top