కాగ్నాలో కొట్టుకుపోయిన దంపతులు 

Two People Washed Away In Flood While Crossing Cagna River In Vikarabad - Sakshi

వికారాబాద్‌ జిల్లా మంతట్టిలో విషాదం

బషీరాబాద్‌: కూరగాయలు అమ్మి తిరిగి వస్తుండగా భార్యాభర్తలు కాగ్నా నది దాటుతూ వరదలో కొట్టుకుపోయారు. మూడు రోజుల తర్వాత కర్ణాటకలోని జెట్టూరు వద్ద శవాలై తేలారు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మంతట్టిలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాటికేరి బుగ్గప్ప (50), యాదమ్మ (45) భా ర్యాభర్తలు. వీరికి మంతట్టి గ్రామ శివారులోని కాగ్నానది పరీవాహక ప్రాంతంలో పొలం ఉంది.

ఆదివారం సాయంత్రం పొలంలో కూరగాయలు కోసుకొని చంద్రవంచలో విక్రయించి.. రాత్రి బంధువుల దగ్గర ఉండి మరుసటి రోజు వస్తామని కొడుకు వెంకటప్పకు చెప్పి వెళ్లారు. అయితే వారు సోమవారం రాకపోవడంతో కొడుకు.. బంధువుల దగ్గర ఆరా తీయగా ఉదయమే మంతట్టికి వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో వారికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు.

బుధవారం ఉదయం వెంకటప్పకు బంధువులు కర్ణాటకలోని జెట్టూరు కాగ్నా నదిలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాల ఫొటోలు పంపారు. అక్కడికి వెళ్లి చూ డగా తన తల్లిదండ్రులేనని గుర్తుపట్టాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుగ్గప్ప, యాదమ్మ దంపతులు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారని, చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారని గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top