
సాక్షి,హైదరాబాద్: మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక కనిపించకుండా పోయింది.. చివరికి ఇంటిమీద నీళ్ల ట్యాంక్‌లో విగత జీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక నిన్న తల్లితో పాటు మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. నిన్న సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకి వచ్చి కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తంమైన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.