గుడ్డిగా నమ్మారు.. చివరికి దుబాయ్‌లో..

Telangana: Gulf Agent Cheating Jagtial Unemploy Youth - Sakshi

ఏజెంట్‌ మోసంతో దుబాయ్‌లో చిక్కుకున్న యువకులు 

ఆదుకోవాలని బాధితుల వేడుకోలు 

జగిత్యాల క్రైం: మంచి ఉద్యోగం, బ్యాంక్‌ రుణం తీసుకొని ఎగ్గొట్ట వచ్చన్న ఏజెంట్‌ మాయమాటలు నమ్మి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నలుగురు యువకులు మోసపోయారు. విజిట్‌ వీసాపై దుబాయ్‌ వెళ్లి అక్కడే చిక్కుకున్నారు. జిల్లాలోని పోతపల్లికి చెందిన రావుల మనోజ్‌కుమార్, తిమ్మాపూర్‌కు చెందిన నూనె నాగరాజు, మడక గ్రామానికి చెందిన నోముల శ్రీధర్, కరీంనగర్‌ పట్టణం భగత్‌నగర్‌కు చెందిన కొమిడి నవీన్‌రెడ్డి.. నిజామాబాద్‌ జిల్లా మానిక్‌బండార్‌కు చెందిన గల్ఫ్‌ ఏజెంట్‌ గుండారపు వంశీకృష్ణను కలిశారు. ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు చెల్లిస్తే విజిట్‌ వీసాపై దుబాయ్‌ పంపిస్తానని, అక్కడ తమవారు రిసీవ్‌ చేసుకొని కంపెనీ వీసా ఇప్పిస్తారని నమ్మబలికాడు. కంపెనీ వీసా వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణం తీసుకుని స్వదేశానికి తిరిగి రావచ్చని నమ్మించాడు.

గుడ్డిగా ఏజెంట్ మాటలు నమ్మారు
ఏజెంట్‌ మాటలు నమ్మిన సదరు యువకులు ఒక్కొక్కరు రూ1.50 లక్షలు చొప్పున చెల్లించి ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి మేడిపల్లి మండలం మన్నెగూడెంకు చెందిన కొడిమ్యాల బాబా శ్రీనివాస్‌ ఈ యువకులను తీసుకెళ్లి దుబాయ్‌లోని సత్వా పట్టణంలో ఓ గదిలో పెట్టాడు. మరుసటి రోజు కంపెనీ వీసా కోసం ఏజెంట్‌ను ఫోన్‌లో నిలదీయగా.. బాబాశ్రీనివాస్‌ ఇప్పిస్తాడని చెప్పాడు. వారంతా శ్రీనివాస్‌ను అడుగగా.. తనకేమీ సంబంధం లేదని, కొద్దిరోజులపాటు తన వద్ద ఉంచుకోమని చెప్పాడన్నారు. దీంతో మోసపోయామని తెలుసుకొని.. పది రోజుల క్రితం నవీన్‌రెడ్డి అక్కడే ఉన్న వారి బంధువుల సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. మిగతా ముగ్గురు ఇండియాకు రావాలంటే ఒక్కొక్కరు రూ.44 వేలు చెల్లించాల్సి ఉంది. తమను ఆదుకోవాలని, విజిట్‌ వీసాపై పంపిన గల్ఫ్‌ ఏజెంట్‌ వంశీకృష్ణపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

( చదవండి: ఆ సంచీలో ఒక్క రూపాయి లేదు.. కిడ్నాప్‌ ఓ డ్రామా! ) 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top