రణరంగమైన చిల్లపేటరాజాం

TDP Followers Attack On Police In Srikakulam District - Sakshi

టీడీపీ వర్గీయుల దాడిలో ఎస్‌ఐతోపాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలుపును జీర్ణించుకోలేక దాష్టీకం

పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడ్డ గ్రామస్తులు

సర్పంచ్‌ భర్తకు తీవ్ర గాయాలు

11 మంది అరెస్టు

శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో ఘటన

రణస్థలం(శ్రీకాకుళం జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో తట్టుకోలేని టీడీపీ వర్గీయులు హింసకు తెగబడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో బీభత్సం సృష్టించారు. పోలీ సుల మీద కూడా కర్రలు, రాళ్లు, సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో గ్రామానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు దొరికినవారిని దొరికినట్టు చితకబాదాయి. సర్పంచ్‌గా గెలిచిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారు అసిరితల్లి భర్తను కొట్టడంతో ఆయన చేయి విరిగింది. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి..

ఆదివారం జరిగిన చిల్లపేటరాజాం పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కంబపు అసిరితల్లి 49 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే కొందరు వ్యక్తులు టీడీపీ మద్దతుదారులు గెలుపొందినట్లు పుకార్లు సృష్టిం చారు. దీంతో రెండు వర్గాలు గొడవకు దిగాయి. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ పోలీసు లు రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు పోలీసులపై కర్రలతో దాడికి పాల్పడడంతోపాటు రాళ్లు, సీసాలు విసరడంతో ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు ఎస్‌ఐ అశోక్‌బాబుకు గాయాలయ్యాయి. దీంతో ఎస్పీ అమిత్‌ బర్దార్‌ నేతృత్వంలో భారీ సంఖ్యలో ప్రత్యేక పోలీసు బలగాలు చిల్లపేటరాజాం చేరుకున్నాయి.

విచక్షణ కోల్పోయిన ప్రత్యేక బలగాలు..
గ్రామానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు పరిస్థితిని అదుపుచేసే క్రమంలో కనిపించిన ప్రతి ఒక్కరిపై లాఠీ ఝుళిపించాయి. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఇంటింటికీ వెళ్లి దొరికినవాళ్లను దొరికినట్టు పోలీసులు చితకబాదారు. ఘర్షణ నెలకొనడంతో గెలిచిన సర్పంచ్‌ అభ్యర్థి అసిరితల్లి, ఆమె భర్త నర్సింహులు రెడ్డి ముందుగానే వారి ఇంటికి చేరుకున్నారు. సర్పంచ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె భర్తను విచక్షణారహితంగా కొట్టారు. ఆయన ఇంటినంతా చిందరవందర చేశారు. లాఠీదెబ్బలకు నర్సింహులు రెడ్డి చేయి విరిగిపోయింది.

సర్పంచ్‌ ఇంటితోపాటు చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు లోనై తలో దిక్కుకు పరుగులు తీశారు. కార్లు, ఆటోల అద్దాలు పగిలిపోయి వీధుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. 50కి పైగా బైకులు ధ్వంసమయ్యాయి. ఘర్షణతో సంబంధం లేనివారిని పోలీసులు కొట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి ప్రవేశించి కిటికీలు, టీవీలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు ధ్వంసం చేయడాన్ని ఖండించారు. జేఆర్‌పురం పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జేఆర్‌పురం ఎస్‌ఐ వాసునారాయణ తెలిపారు.

బాధితులకు అండగా ఉంటాం
చిల్లపేటరాజాంలో బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. గాయపడినవారిని ఆయన సోమవారం పరామ ర్శించారు. పోలీసులు సామాన్యులను శిక్షించడం చాలా బాధాకరమన్నారు.
చదవండి:
ఉరకలేస్తున్న వైఎస్సార్‌ సీపీ.. నిస్తేజంలో టీడీపీ

13 మంది దుర్గ గుడి ఉద్యోగులు సస్పెన్షన్‌..  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top