Tamil Nadu: భర్త మరుగు దొడ్డి కట్టించలేదని.. ఉరితాడుకు రమ్య!

Tamil Nadu: Ramya Kills Self Over Toilet Lack At Husband's House - Sakshi

చదువుకున్న ఆ అమ్మాయి.. ప్రాణంగా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ, అతని ఇంట పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మచ్చా(బావా) అని ప్రేమగా పిల్చుకునే భర్త దగ్గర బాధను వెల్లగక్కుకుంది. అది అతను అర్థం చేసుకోలేకపోయేసరికి.. పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త మనసు మారిందేమో అని మళ్లీ ప్రయత్నిస్తే.. అతను అదే సమాధానం ఇవ్వడంతో  పెళ్లై నెల కూడా గడవక ముందే ఆ కొత్త పెళ్లికూతురు ఏకంగా ప్రాణమే తీసుకుంది.

చెన్నై: తమిళనాడులో ఈ ఘటన జరిగింది. 27 ఏళ్ల రమ్య  భర్త తన ఇంట మరుగుదొడ్డి కట్టించడం లేదన్న ఆవేదనతో ప్రాణం తీసుకుంది. కడలూరు అరిసిపెరియాన్‌కుప్పంకు చెందిన రమ్య.. ఎమ్మెస్సీ చదివింది. ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. రెండేళ్లుగా కార్తికేయన్‌ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉంది. పెద్దలను ఒప్పించి కిందటి నెల(ఏప్రిల్‌ 6న) వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే కాపురానికి వెళ్లిన ఆమెకు అక్కడ మరుగు దొడ్డి లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది. కడలూరులోనే మరో ఇంటికి మారుదామని అతన్ని కోరింది. కానీ, ఆ కోరిక వివాదానికి దారి తీసింది. 

అందరిలాగా బహిర్భూమికి వెళ్లమంటూ సలహా ఇచ్చాడు ఆ భర్త. ఈ పరిణామంతో కలత చెందిన రమ్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కొన్నిరోజులకు భర్త మనసు మారిందేమో అనే ఉద్దేశంతో.. ఆమె సోమవారం మళ్లీ అతనికి ఫోన్‌ చేసి మాట్లాడింది. మరుగుదొడ్డి ఉన్న ఇంటికి మారుదామని మరోమారు బతిమాలింది. కానీ, అతను మాత్రం కరగలేదు. ససేమిరా కుదరదని చెప్పేశాడు. దీంతో ఆవేదన చెందిన రమ్య.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఉరి కొయ్యకు వేలాడుతున్న రమ్యను.. గుర్తించిన ఆమె తల్లి ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. టాయిలెట్‌ లేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

కష్టాలు ఎదురైనా.. మనోధైర్యంతో ముందుకు సాగే స్ఫూర్తిదాయకమైన కథలు ఎన్నో. అవి చూసి కూడా జీవితం విలువ గుర్తించరు కొందరు. పైగా చిన్నచిన్న కారణాలకే ప్రాణం తీసుకుంటారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు:
 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top