తండ్రి హత్య కేసులో కుమారుడు, కుమార్తె అరెస్ట్‌ 

Son And Doughter Arrested Father Murder Case In Warangal - Sakshi

సాక్షి, భూపాలపల్లి(వరంగల్‌): ఇటీవల సింగరేణి కార్మికుడిని హత్య చేసిన కేసులో అతని కుమారుడు, కుమార్తెను అరెస్ట్‌ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు భూపాలపల్లి సీఐ ఎస్‌ వాసుదేవరావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని టీ2 క్వార్టర్స్‌లోని టీ2– 658 క్వార్టర్‌లో నివాసం ఉండే గొడ్డె నాగభూషణం(44) తన ఇంట్లో ఈ నెల 22న రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడి రెండో భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఎస్‌ వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హత్య జరిగిన రోజు నుంచి నాగభూషణం కుమారుడు జగదీష్, కుమార్తె ఉమామహేశ్వరిలు పరారీలో ఉన్నారు. శుక్రవారం ఉదయం వారి దుస్తులు, డబ్బులు తీసుకెళ్తేందుకని భూపాలపల్లికి వచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి వారిని పట్టుకుని విచారించారు. పోలీసుల విచారణలో తామే హత్య చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. తమ తండ్రి ఆగడాలు తట్టుకోలేకనే హత్యకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. నాగభూషణం కుటుంబాన్ని పట్టించుకోకపోవడమే కాక భార్యను వేధించేవాడు.

అతడి వేధింపులు కారణంగానే అనారోగ్యానికి గురైన భార్య సుజాత మృతి చెందింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరొకరిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం పిల్లలిద్దరూ తమకు ఆస్తులు, డబ్బులు పంచి ఇవ్వాలని కోరారు. దీంతో గొడవలు ప్రారంభమయ్యాయి. చేసేది లేక తండ్రిని హత్య చేయాలని వారు భావించారు. ఈ మేరకు జగదీష్, ఉమామహేశ్వరి, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మంథని ముత్తారం మండలం దర్యాపూర్‌కు చెందిన యువకుడు గాదం రామకృష్ణలు కలిసి పట్టణంలోని చైనా బజార్‌లో రెండు కత్తులు కొనుగోలు చేశారు. పినతల్లి శారద లేని సమయం చూసి ఈ నెల 22 రాత్రి జగదీష్, ఉమామహేశ్వరి, రామకృష్ణలు కలిసి నాగభూషణంను హత్య చేశారు.నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు.  

చదవండి: పెళ్లి అయిన మూడు రోజులకే.. ‘నవ వరుడి’ ఆత్మహత్యాయత్నం..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top