కుకింగ్‌ చేస్తే రైస్‌‘పుల్లింగ్‌’! | Sakshi
Sakshi News home page

కుకింగ్‌ చేస్తే రైస్‌‘పుల్లింగ్‌’!

Published Tue, Oct 3 2023 1:13 AM

Rice Pulling Gang Arrest in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చంద్రయాన్‌–3 పేరుతో హైదరాబాద్‌లో ఒకరిని బురిడీ కొట్టించి రూ. 3 కోట్లు కొల్లగొట్టిన రైస్‌ పుల్లింగ్‌ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ కేటుగాళ్ల మోడస్‌ ఆపరెండీని సీసీఎస్‌ పోలీసులు వివరించారు. సాధారణ చెంబు, బిందెలకు అతీంద్రియశక్తులు ఉన్నాయంటూ నమ్మించి నిండా ముంచడం వారి శైలి అని... సాధారణ చెంబు/బిందెను ‘రైస్‌పుల్లర్‌’గా మార్చడానికి ‘కుకింగ్‌’ చేస్తుంటారని పేర్కొన్నారు.

అమోఘ శక్తులంటూ...
రైస్‌ పుల్లింగ్‌ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్లు అందినకాడికి దండుకుంటుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటికి చేజిక్కించుకుంటే అమోఘ మైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. సాధారణంగా కేటుగాళ్లు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలనే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న పాత్రలను చూసే అవకాశం కొనే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించాలని కోరితే మాత్రం చూపిస్తారు.

ఇలాంటి ముఠాలు బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్‌ పుల్లింగ్‌ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్లీ బియ్యంలా కనిపించేలాగా చేస్తారు. అనంతరం రైస్‌పుల్లర్‌గా పేర్కొనే పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచంకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో కూడిన బియాన్ని ఉంచితే అది దానికి అతుక్కుంటుంది.

ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకుంటుంటారని పోలీసులు వివరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారేనని పోలీసులు చెబుతున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రైస్‌ పుల్లింగ్, డబుల్‌ ఇంజిన్‌గా పిలిచే రెండు తలల పాములతో మోసాలు చేసే ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

దొంగ సర్టిఫికేషన్లు
రైస్‌ పుల్లింగ్‌ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. వాటి కేంద్రంగానే కొన్ని ఉపకరణాలను కలిగి ఉండి ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ ఆయా ఉపకరణాలు నిజమైనవనేలా సర్టిఫికేషన్‌ ఇచ్చేస్తుంటారు. ఇదంతా దాన్ని కొనే వారి ఎదురుగానే జరుగుతుంది. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇకపై ఇంకెవరూ మోసపోకుండా అప్రమత్తం చేసిన వాళ్లవుతారని చెబుతున్నారు.

కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం
పోలీసులు అరెస్టు చేసిన విజయ్‌కుమార్, సాయి భరద్వాజ్, సంతోష్, సురేందర్‌లను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులు నిర్ణయించారు.
 

Advertisement
 
Advertisement