ట్యాపింగ్‌ ద్వారానే ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగులోకి! | Sakshi
Sakshi News home page

ట్యాపింగ్‌ ద్వారానే ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగులోకి!

Published Fri, Apr 5 2024 3:34 AM

Praneet Rao tapped the phones of four MLAs - Sakshi

నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్‌ చేసిన ప్రణీత్‌రావు 

బేరసారాలు వెలుగులోకి వచ్చాక పక్కా స్కెచ్‌... కీలకంగా వ్యవహరించిన రాధాకిషన్‌, మరో అధికారి పోలీసు కస్టడీలోకి వచ్చిన సిటీ టాస్క్ ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ 

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐబీ అధీనంలోని స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే బీజేపీ అగ్రనేత బీఎల్‌.సంతోష్‌ సహా పలువురు ప్రముఖులు నిందితులుగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తేలింది. నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిస్వామి ట్రాప్‌ కావడం, పట్టుబడటంలో అప్పట్లో హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా (ఓఎస్డీ) పనిచేసిన పి.రాధాకిషన్‌రావుతోపాటు సైబరాబాద్‌కు చెందిన మరో అధికారి కీలకంగా వ్యవహరించినట్టు సిట్‌ గుర్తించింది. రాధాకిషన్‌ను వారంరోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో గురువారం వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్‌ ఠాణాకు తరలించారు. ఈయన నుంచి కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించాల్సి ఉందని పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్‌ ప్రకటించారు.  

భారీ స్కెచ్‌...: 2022లో మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ.. మెయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో అప్పటి  తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో తిరుపతికి చెందిన సింహయాజిస్వామి, ఫరీదాబాద్‌లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్‌శర్మ అలియాస్‌ రామచంద్రభారతి, నగరవ్యాపారి నందకుమార్‌ సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులకు చిక్కారు. వీరు అప్పటి అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నట్టు మొయినాబాద్‌ ఠాణాలో కేసు నమోదైంది.

బీజేపీ ఎర వేసినట్టు ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల్లో పైలెట్‌ రోహిత్‌రెడ్డితో పాటు హర్షవర్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతరావు ఉన్నారు. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ఈ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్‌ చేసినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఎర అంశం వెలుగులోకి రావడంతో ఆయన ప్రభాకర్‌రావును అప్రమత్తం చేశారు. అప్పటి సర్కారుకు సమాచారం ఇచ్చిన ప్రభాకర్‌రావు టాస్క్‌ఫోర్స్‌కు ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్‌రావుతో కలిసి భారీ స్కెచ్‌ వేశారు. 

సైబరాబాద్‌ అధికారులతో కలిసి అమలు... 
వీరు వేసుకున్న పథకం ప్రకారం బీజేపీ తరఫున వస్తున్న సింహయాజిస్వామి, సతీష్ శర్మ, నందకుమార్‌లను ట్రాప్‌ చేయడానికి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. నందకుమార్‌ ఫోన్‌ను కూడా కొన్నాళ్లు ట్యాప్‌ చేయడం ద్వారా మరికొంత సమాచారం సేకరించారు. రాధాకిషన్‌రావు సహా మరికొందరు అధికారులు ట్రాప్‌ జరగడానికి ముందు రోజు (2022 అక్టోబర్‌ 25) ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ అవసరమైన ప్రాంతాల్లో రహస్యంగా సీసీ కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లు, మైక్‌లు.. ఇలా మొత్తం 75 సాంకేతిక ఉపకరణాలు అమర్చారు.

ఈ వ్యవహారంలో రాధాకిషన్‌రావుతో పాటు సైబరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన అధికారి కీలకంగా వ్యవహరించినట్టు తేలింది. 2022 అక్టోబర్‌ 26 రాత్రి ఫామ్‌హౌస్‌ సమీపంలో వలపన్ని ఉన్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్‌ ఎస్‌ఓటీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న ముగ్గురినీ పట్టుకున్నారు. ఈ ఎపిసోడ్‌ మొత్తం సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించినది అయినా.. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు రంగంలోకి దిగారని తెలుస్తోంది.  

కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో... 
ఎమ్మెల్యేల ఎర కేసును తొలుత మొయినాబాద్‌ పోలీసులే దర్యాప్తు చేశారు. అయితే లోతైన దర్యాప్తునకు నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. దీని దర్యాప్తు తుది దశకు చేరిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, తాము ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు పూర్తి చేస్తోందంటూ హైకోర్టు ఆదేశాలను నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌ అక్కడే పెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలోనే తాజా కేసులో భాగంగా నాటి ‘ఎర కేసు’లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నారు. రాధాకిషన్‌రావును పోలీసు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఎస్‌ఐబీలో అనధికారికంగా, రహస్యంగా, చట్ట విరుద్ధంగా ప్రైవేట్‌ వ్యక్తుల ప్రొఫైల్‌లను అభివృద్ధి చేయడంలో రాధాకిషన్‌రావు కీలకపాత్ర పోషించారు.

కొంతమంది వ్యక్తుల ఆదేశానుసారం వాటిని రాజకీయపార్టీకి అనుకూలంగా, పక్షపాత ధోరణిలో ఉపయోగించుకోవడంలో మరికొందరితో కలిసి పన్నిన కుట్రలో భాగస్వాముడయ్యారు. ఆ నేరాలకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారం సేకరించే కోణంలో దర్యాప్తు అధికారి, ఆయన బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది’అని పేర్కొన్నారు.     

Advertisement
Advertisement