హైదరాబాద్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ ఐడియాలజీని నిర్మించిన పుల్లూరు ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయారు. తెలంగాణ ఎస్‌ఐబీ (ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో) చేపట్టిన కీలక ఆపరేషన్‌లో మావోయిస్టు చంద్రన్న లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చంద్రన్న సైతం లొంగిపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
చంద్రన్నది తెలంగాణ రాష్ట్రంలో పెదపల్లి జిల్లాలోని ఎడ్కాపూర్ గ్రామం. ఈ ఏడాది మే నెలలో బీజాపూర్ కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌లో చంద్రన్న మృతిచెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకన్నారు. తాజాగా తెలంగాణ ఎస్‌ఐబీ చేపట్టిన కీలక ఆపరేషన్‌లో చంద్రన్న లొంగిపోయారు.
ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ ఈ ఏడాది తెలంగాణలో 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు చంద్రన్న లొంగిపోయారు. చంద్రన్నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. చంద్రన్న కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ నుంచి 64 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వారంతా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి’ అని పేర్కొన్నారు.
లొంగుబాటు పరంపరం..
మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు కొన్ని రోజుల క్రితం లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న వీరు లొంగిపోయిన తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు సైతం వారి వారిప్రాంతాల్లో పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ కావడంతో మావోయిస్టులు తమ ఆయుధాల్ని ీవీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.
కాగా, దండకారణ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మావోయిస్టులకు అనుకూలంగా లేకపోవడంతో వారు లొంగిపోక తప్పడం లేదనే వాదన తెరపైకి వచ్చింది.
తెలంగాణ డీజీపీ ఎదుట బండి ప్రకాశ్ సరెండర్


