తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి(ఇన్‌సెట్‌లో బండి ప్రకాశ్ పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా, అక్కడి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోయారని తెలుస్తోంది.
మావోయిస్టులు లొంగిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు లొంగిపోయారని.. మిగతా వాళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగం కావాలని కోరారాయన. అదే సమయంలో..
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో ఆ పార్టీ కీలక సభ్యులు తమ దళాలతో వరుసగా లొంగిపోతున్నారు. మావోయిస్ట్ పార్టీ లో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాశ్. గత 45 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో పని చేసిన ఆయన లొంగిపోవడం.. ఆ పార్టీకి భారీ దెబ్బే అని చెప్పొచ్చు.


