పరువు తీస్తామంటూ బ్లాక్‌మెయిల్‌

Police solved the case of suicides - Sakshi

భరించలేక పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

టంగటూరు ఆత్మ’హత్య’ల కేసును ఛేదించిన పోలీసులు

ఇద్దరు విలేకరులు, ఓ హోంగార్డు రిమాండ్‌

పరారీలో మరో ముగ్గురు విలేకరులు

మణికొండ: ముగ్గురు కన్న బిడ్డలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డ కేసును మోకిల పోలీసులు ఛేదించారు.  కేసు వివరాలను బుధవారం నార్సింగి ఏసీపీ కార్యాలయంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ వెల్లడించారు. శంకర్‌పల్లి మండలం, టంగటూరుకు చెందిన నీరటి రవి(40) విజయనగరంలోని జీఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌ మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌లో వందలాదిమందిని చేర్పించి మోసపోయాడు. మొదట్లో డబ్బులు సక్రమంగానే ఇచ్చిన సదరు ఫౌండేషన్‌ ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేసింది.

ప్రతి నెలా వచ్చే డబ్బులు రాకపోవడంతో రవిపై సభ్యుల ఒత్తిడి పెరిగింది. అందులో హోంగార్డు నాగరాజు, అతని భార్య ఒత్తిడి అధికం కావటంతో తన భార్య పేరిట ఉన్న రెండు ప్లాట్‌ల పత్రాలను తాకట్టు పెట్టి రూ. 18 లక్షలను తెచ్చి ఇచ్చాడు. దీంతో మిగిలిన వారు ఒత్తిడి చేస్తూ వచ్చారు. విషయం తెలుసుకుని శంకర్‌పల్లి మండలానికి చెందిన విలేకరులు శ్రీను,  శ్రీనివాస్, మహేష్, ప్రవీణ్,, శ్రీనివాస్‌రెడ్డి  బెదిరించారు.

పత్రికల్లో రాయొద్దంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో చివరికి భార్య పుస్తెల తాడును తాకట్టు పెట్టి రూ. 2.50 లక్షలు వారికి ఇచ్చాడు. అయినా వేధింపులు ఎక్కువ కావటంతో మార్చి నెల 3వ తేదీన ఇంట్లో తన ముగ్గురు కుమారులు సాయికిరణ్‌(13), మోహిత్‌(11), ఉదయ్‌కిరణ్‌(9)ల మెడకు తాడుతో బిగించి హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఐదు మంది విలేకరులతో పాటు అతన్ని వేధింపులకు గురి చేసిన మరో నలుగురిని గుర్తించి కేసులో చేర్చారు. శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్, హోంగార్డు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మిగిలిన ముగ్గురు విలేకరులు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు.

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top